టీఆర్ఎస్ది సెన్సార్ పాలన
* స్వైన్‌ఫ్లూ నివారణలో సర్కారు విఫలం
* ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి
కరీంనగర్: ఎన్నికలకు ముందు ఆకాశమే హద్దుగా హామీలు గుప్పించిన కేసీఆర్ ఇప్పుడు పథకాలన్నింటికీ కత్తెర్లు పెడుతూ.. సెన్సార్ పాలన నడుపుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. గురువారం కరీంనగర్ వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.
టీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన పథకాలు అమలుకు నోచుకోకున్నా.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునే ఆకర్ష్ పథకం మాత్రం సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళితులకు భూపంపిణీ, ఫాస్ట్, బీడీకార్మికులకు జీవనభృతి, చేనేత కార్మికులు, రైతుల ఆత్మహత్యల నివారణపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యో గం వస్తుందని నిరుద్యోగులను ఆశపెట్టి నేడు టీపీఎస్సీ సిలబస్ మారుస్తున్నారన్నారు. ఎంసెట్ ఎవరు నిర్వహిస్తారో తెలియని పరిస్థితి ఉందన్నారు.
రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ నివారణలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సహా అందరూ విఫలమయ్యారన్నారు. ముఖ్యమంత్రే ఈ విషయాన్ని అంగీకరించాక ప్రజల కు ఆరోగ్య భద్రత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం నాగార్జునసాగర్ నీటి వాటా కోసం వెళ్లిన తెలంగాణ ఇంజినీర్లపై ఏపీలో భౌతిక దాడులు చేయడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజల హక్కులు కాపాడలేని బీజేపీ ప్రజల కోపతాపాలకు గురికాకతప్పదన్నారు.