sensor technology
-
నీటి వృథాకు సెన్సర్‌తో చెక్
సాక్షి, హైదరాబాద్: వందల కిలోమీటర్ల దూరం నుంచి నగరానికి తరలిస్తున్న కృష్ణా, గోదావరి జలాలు వృథా కాకుండా జలమండలి సెన్సర్ సాంకేతికతతో చెక్ పెట్టనుంది. మహానగరం పరిధిలో జలమండలికున్న సుమారు 400 సర్వీసు రిజర్వాయర్లు.. ఓఆర్ఆర్ ఫేజ్–2 పథకం కింద నూతనంగా ఏర్పాటు చేయనున్న మరో వందకు పైగా రిజర్వాయర్లకు ఈ సాంకేతికతను ఏర్పాటు చేయనున్నారు. ఆయా రిజర్వాయర్ల వద్ద ప్రతి నిత్యం ఏరులై పారుతున్న శుద్ధి చేసిన నీటిని వృథాను కట్టడి చేయనున్నారు. తద్వారా నగరంలో రోజువారీగా 45 శాతం లెక్కలోకి రాని నీటి మొత్తంలో కనీసం పదిశాతం నీటినైనా ఒడిసిపట్టనున్నారు. అలారం మోతతో అప్రమత్తం ఫిల్టర్బెడ్ల నుంచి రిజర్వాయర్లకు శుద్ధి చేసిన జలాలను పంపింగ్ చేయడం ద్వారా నింపుతున్న విషయం విదితమే. ఇదే సమయంలో ఆయా రిజర్వాయర్ల లోపల సెన్సర్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో స్టోరేజి రిజర్వాయర్ నిండుతున్న క్రమంలో పూర్తిస్థాయి నీటిమట్టానికి ఒక అడుగు ఉన్న సమయానికే ఈ సెన్సర్ గ్రహించి అలారానికి సంకేతాలు పంపుతుంది. అలారం పెద్ద శబ్దంతో మోగుతుంది. వెంటనే అక్కడి క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తమై వెంటనే రిజర్వాయర్‌లోకి నీటిని మళ్లించే వాల్వును ఆపేస్తారు. ఒకవేళ అలారం మోగినపుడు సిబ్బంది అందుబాటులో లేనప్పటికీ.. ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా సంబంధిత మేనేజర్‌తోపాటు రిజర్వాయర్ ఇన్చార్జికి సైతం ఫోన్‌కాల్ వెళ్తుంది. రిజర్వాయర్ నిండింది అంటూ వాయిస్‌కాల్ వెళ్తుంది. వెంటనే వారు అప్రమత్తమై వాల్వును ఆపేసే అవకాశం ఉంటుంది. ఈ సాంకేతికతను పర్యవేక్షించేందుకు ప్రతి 5– 6 రిజర్వాయర్లకు ఒక ఇన్చార్జిని జలమండలి నియమించనుంది. అన్ని రిజర్వాయర్లకు ఈ సాంకేతికతను ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.కోటి వ్యయం అవుతుందని జలమండలి అధికారులు అంచనా వేస్తున్నారు. మరో రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు తెలిపారు. పొంగిపొర్లడం నిత్యకృత్యమే.. నగరంలో జలమండలి స్టోరేజి రిజర్వాయర్లున్న ప్రతీ వీధి, కాలనీలో స్వచ్ఛమైన తాగునీరు పొంగిపొర్లడం స్థానికులకు నిత్యకృత్యమే. క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రతి రిజర్వాయర్ ఓవర్ ఫ్లో అయ్యే వరకు వాల్వ్‌ను నిలిపివేయరు. దీంతో విలువైన తాగునీరు రహదారులు, కాలనీలను ముంచెత్తుతోంది. ఈ పరిస్థితికి సెన్సర్ సాంకేతికతతో చెక్ పెట్టనున్నట్లు జలమండలి తెలిపింది. నీటి వృథాను అరికట్టండి నగరానికి జలమండలి సరఫరా చేస్తున్న నీటి వాటాలో ఎలాంటి కోతలు లేవు. వేసవి కారణంగా వినియోగం అనూహ్యంగా పెరిగింది. దీంతో వాహనాలు, ఫ్లోర్ క్లీనింగ్, గార్డెనింగ్ అవసరాలకు నల్లా నీటిని వినియోగించవద్దు. తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వాడుకోవాలి. నీటి పొదుపుపై అన్ని వర్గాలు అవగాహన పెంపొందించుకోవాలి. – ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ (చదవండి: ఆ చిరునవ్వులిక కానరావు) -
300 అడుగుల లోతు నుంచి 2 గంటల్లోనే..
గతేడాది చైనాలో ఏకంగా 300 అడుగుల బోరుబావిలో అడుగున ఉన్న మూడేళ్ల బాలుడిని అక్కడి అధికారులు కేవలం రెండు గంటల్లోనే కాపాడి శెభాష్ అనిపించుకున్నారు. కానీ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చనువెళ్లి గ్రామంలో గురువారం సాయంత్రం బోరు బావిలో పడిన 18 నెలల చిన్నారి మీనాను మూడు రోజులైనా ప్రాణాలతో బయటకు తీయలేకపోయారు. చివరికి మృతదేహాన్ని అవశేషాలతో బయటకు తీయాల్సి వచ్చింది. తొలుత పాప కేవలం 40 అడుగుల లోతులో పడిపోయిందని త్వరగానే రక్షిస్తారని అందరూ భావించగా.. ఆపై 110 అడుగుల లోతుకు జారిందని శుక్రవారం అన్నారు. శనివారం నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చిన్నారి మీనా 200 అడుగుల మేర ఉన్నట్లుగా కెమెరాలలో కనిపించక పోవడం విచారకరం . చైనాలో అద్భుతమైన టెక్నాలజీ ఆ వివరాలు.. గతేడాది మార్చి 31న తూర్పు చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్, వీఫాంగ్ లో మూడేళ్ల బాలుడు స్నేహితులతో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అరగంటలో ఘటనాస్థలానికి రెండు ఫైరింజన్లు, 12 మంది సిబ్బంది చేరుకున్నారు. 11 ఇంచుల వెడల్పున్న బోరు బావిలో పడ్డ చిన్నారి 300 అడుగుల లోతులో ఉన్నాడని సెన్సార్ల ద్వారా గుర్తించారు. సెన్సార్లతో పాటు ఆక్సిజన్ పైపును, చిన్నారికి కట్టేందుకు ఇతరత్రా పైపులను సిబ్బంది బోరులోకి పంపారు. సెన్సార్ల సాయంతో వారి వద్ద ఉన్న మానిటర్లో బాలుడి కదలికలను గుర్తించారు. ఆపై బాబు ముక్కుకు ఆక్సిజన్ పైపు సెట్ చేశారు. అత్యాధునిక సెన్సార్ల సాయంతో బాబుకు ఓ పైపు చుట్టుకునేలా చేశారు. తమ వద్ద ఉన్న స్క్రీన్‌లో చూస్తూ చిన్నారికి కట్టిన పైపుతో పాటుగా ఆక్సిజన్, సెన్సార్ పైపులను పైకి లాగడం ప్రారంభించారు. ఇలా జాగ్రత్తగా రెండు గంటలపాటు ఎంతో శ్రమించిన సిబ్బంది బాలుడికి ఎలాంటి గాయాలు అవకుండానే బోరుబావి నుంచి రక్షించారు. బాలుడి తల్లిదండ్రులతో పాటు ఘటనా స్థలంలో ఉన్న అందరూ ఈ అద్బుతాన్ని వీక్షించారు. బాలుడి తండ్రి చెంగ్ ఫైర్ సిబ్బందికి ధన్యావాదాలు తెలిపాడు. అంత లోతైన బోరుబావిలో పడినా.. నా కుమారుడికి స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయి. అయితే భయంతో ఎంతోసేపు ఏడుస్తూనే ఉన్నాడని చెప్పాడు. అద్భుతమైన టెక్నాలజీని వినియోగించిన కారణంగానే సిబ్బంది తమ కుమారుడిని రక్షించగలిగారని ఆనందభాష్పాలతో చెప్పడం స్థానికులు ఎప్పటికీ మరిచిపోరు. ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తే 300 అడుగుల లోతైన బోరు బావిలో పడిన చిన్నారుల ప్రాణాలను సైతం సులువుగా రక్షించవచ్చని చైనా వాసులు నిరూపించినా.. భారత్ లో మాత్రం 100 అడుగుల లోతైన బోరు బావిలో పడుతున్న చిన్నారులను రక్షించలేక పోవడం విచారకరమని భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత కథనాలు చిట్టితల్లీ క్షేమమేనా? 200 అడుగుల కిందికి జారిన చిన్నారి