అయిదో రోజు సేమ్ సీన్ రిపీట్
హైదరాబాద్ : అయిదో రోజు అదే తీరు.....అసెంబ్లీలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. శాసనసభలో వరుసగా అయిదోరోజు కూడా తెలంగాణ, జై సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లింది. బుధవారం ఉదయం విపక్షాల నిరసనల మధ్యే అసెంబ్లీ ప్రారంభమైంది. స్పీకర్ నాదెండ్ల మనోహర్ ....విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలు తిరస్కరించారు. దాంతో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత సభ్యులు ఫ్లకార్డులతో స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలతో సభను హోరెత్తించారు.
సభా సమయాన్ని ఉపయోగించుకుని, చర్చలో పాల్గొనాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసిన ఫలితం లేకపోయింది. ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లు ....తమ సభ్యులను వెనక్కి పిలవాలంటూ స్పీకర్ ఓ దశలో అసహనం వ్యక్తం చేశారు. సభా సమయాన్ని వృధా చేయటం సరికాదని, చర్చలో పాల్గొని అభిప్రాయాలు తెలపాలంటూ సభాపతి సూచించినా పరిస్థితిలో మార్పు రాలేదు. దాంతో ఆయన సమావేశాలను గంటపాటు వాయిదా వేశారు.
కాగా విపక్షాలు బుధవారం శాసనసభలో వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ....సమైక్య తీర్మానం చేయాలంటూ వైఎస్ఆర్ సీపీ, తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చించాలని తెలుగుదేశం పార్టీ, పాలెం వోల్వో బస్సు ప్రమాద బాధితులకు పరిహారం చెల్లించాలంటూ సీపీఐ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి.