ఇక రైల్వే బడ్జెట్ కనుమరుగేనా!
న్యూఢిల్లీ: బ్రిటీష్ పరిపాలన కాలం నుంచి ఉన్న రైల్వే బడ్జెట్ ఇక కనుమరుగవనుందా! సాధరణ బడ్జెట్లో కలిపే రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెడతారా? లేక వేరే ఏదైన కొత్త తరహా వ్యవస్థను తీసుకొస్తారా? ప్రధాని మోదీ ప్రభుత్వ హయాంలో రైల్వే బడ్జెట్‌కు ఇక చరమ గీతం పాడుతున్నట్లేనే? ఇప్పుడు ఈ అనుమానాలు, ప్రశ్నలను నీతి ఆయోగ్ ప్యానెల్ తీసుకున్న ఓ కొత్త నిర్ణయం రేకెత్తిస్తోంది.
ఆంగ్లేయుల పాలన కాలంలో నుంచి ఉన్న ప్రత్యేక రైల్వే బడ్జెట్ విధానానికి ఇక స్వస్తి పలకాలని నీతి ఆయోగ్ ప్యానెల్ సభ్యుడు బిబేక్ దెబ్రే ప్రతిపాదించినట్లు సమాచారం. సాధారణ బడ్జెట్లోనే కలిపి రైల్వే బడ్జెట్‌ను కూడా ప్రవేశ పెట్టేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షుడిగా ఉన్న నీతి ఆయోగ్‌కు ప్రధాని మంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా దెబ్రీ రైల్వే వ్యవస్థ మార్పులపై పలు ప్రతిపాదనలు చేస్తూ ఇందులోనే ప్రత్యేక రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టే విధానానికి స్వస్తి పలకాలని చెప్పినట్లు తెలుస్తోంది.