షేరింగ్ ఆటోలు,క్యాబ్‌లకు ప్రత్యేక స్టేజీ
సాక్షి,సిటీబ్యూరో: సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని ‘అభయ’ గ్యాంగ్‌రేప్ ఘటన పునరావృతం కాకుండా సైబరాబాద్ పోలీసులు పక్కా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఐటీ కంపెనీల ప్రతినిధులతో సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సుమారు 250 ఐటీ కంపెనీలు పాల్గొననున్నాయి. రాత్రివేళ్లలో ఉద్యోగినుల ప్రయాణం కోసం ఐటీ కంపెనీలు తీసుకుంటున్న చర్యలను ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.
ప్రత్యేక స్టేజీలు : ఐటీ ఉద్యోగులు ఆర్టీసీ బస్సులు,కంపెనీ క్యాబ్‌లతోపాటు షేరింగ్‌ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని షేరింగ్ ఆటోలు, క్యాబ్‌లకు ప్రత్యేక స్టేజీలు ఏర్పాటు చేయాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి నిర్ణయించారు. ఈ స్టేజీల వద్ద ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో తిరిగే షేరింగ్ ఆటోలు,క్యాబ్‌లకు ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయిస్తున్నారు. ఈ నెంబర్లు లేని ఆటోలు,క్యాబ్‌లను ఆయా ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోను తిరగనివ్వరు.
పోలీసులు,ఆర్టీసీ సంయుక్త సర్వే : ఇలా ఉండగా, ఐటీ కారిడార్‌లో ప్రజారవాణా మెరుగుదలకు చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం సైబరాబాద్ పోలీసులు, ఆర్టీసీ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు. మాదాపూర్,గచ్చిబౌలి ప్రాంతాల్లోని ఐటీ కారిడార్‌లో ఆర్టీసీ హైదరాబాద్ ఆర్ఎం ఎన్.వి.రావు నేతృత్వంలో పలువురు డీవీఎంలు,డీఎంలు,100మంది ఆర్టీసీ సూపర్వైజర్లు, పలువురు సీఐలు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఐటీ ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఏ రూట్లో బస్సులు పెంచాలి, ఏయే సమయాల్లో అందుబాటులో ఉండాలి వంటి అంశాలపై ఆరాతీశారు.