తల్లీ పిల్లల కోసం ‘అమ్మ ఒడి’
• గర్భిణులు, తల్లీ పిల్లల ఉచిత తరలింపు
• వారం రోజుల్లో రంగంలోకి 41 కొత్త వాహనాలు
• ఏజెన్సీల్లో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఏజెన్సీల్లో గర్భిణీలు సుదూర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు వెళ్లాలన్నా, ప్రసవం తర్వాత ఇంటికి వెళ్లాలన్నా అనేక కష్టనష్టాలకు గురికావాల్సి వస్తోంది. ‘108’వాహనాలున్నా అవి పెద్దగా సేవలు అందించడంలేదన్న విమర్శలున్నారుు. దీంతో గర్భిణీలు, ప్రసవం తర్వాత తల్లీ పిల్లలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. పైగా సరిగా రోడ్లు లేకపోవడంతో బస్సుల్లో ప్రయాణం గర్భిణీలకు ఇబ్బందిగా మారుతోంది. కొన్ని ప్రాంతాలకు బస్సు సౌకర్యమూ లేని దుస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో గర్భిణీలను ఆస్పత్రులకు క్షేమంగా తీసుకురావడం, ప్రసవం తర్వాత తల్లీ బిడ్డలను ఇంటికి సురక్షితంగా తీసుకెళ్లడం కోసం ‘అమ్మ ఒడి’కార్యక్రమం ద్వారా ప్రత్యేక వాహన సదుపాయం కల్పించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణరుుంచింది. ‘102’కు ఫోన్ చేస్తే ప్రత్యేక సదుపాయాలున్న వాహనం వచ్చేలా ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో 41 వాహనాలను ఏర్పాటు చేయనున్నారు. వాహనంలో తీసుకురావడం, తీసుకెళ్లడం పూర్తిగా ఉచితమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు.
వాహనాల్లో ప్రత్యేక సదుపాయాలు
గర్భిణీలను తరలించడానికి బొలెరో వాహనాలను ఉపయోగిస్తారు. అందుకోసం ఆయా వాహనాల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తారు. కూర్చోడానికి, నీరసంగా ఉంటే పడుకోవడానికి వీలుగా వాటిని తీర్చిదిద్దుతారు. గతుకుల రోడ్లలో క్షేమంగా తీసుకెళ్లేలా డ్రైవర్లకు ప్రత్యేక హెచ్చరికలు ఉంటారుు. గర్భిణీలు ప్రతి మూడు నెలలకోసారి చెకప్‌ల కోసం ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చినా ఈ ఉచిత వాహన సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ‘102’కు ఫోన్ చేస్తే మనం కోరుకున్న చోటుకు వాహనాలు వస్తారుు. రాష్ట్రంలో ఉట్నూరు, భద్రాచలం, ఏటూరునాగారం, నాగర్ కర్నూల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వాహనాలను అందుబాటులోకి తేనున్నారు.