ఐఫోన్ 7 లాంచింగ్‌కు ఆహ్వానాలు వచ్చేశాయ్
శాన్ఫ్రాన్సిస్కో : యాపిల్ ఐఫోన్ 7 కోసం వేచిచూస్తున్న వినియోగదారులకు వచ్చే వారంలో శుభవార్త అందనుందట. శాన్ఫ్రాన్సిస్కోలోని బిల్ గ్రాహమ్ సివిక్ ఆడిటోరియంలో యాపిల్ ఓ మెగా ఈవెంట్ నిర్వహించబోతుందట. ఈ మెగాఈవెంట్లో ఐఫోన్ 7 ను వినియోగదారుల మందుకు తీసుకురానున్నట్టు ఫోర్బ్స్ నివేదిక వెల్లడిచింది. ఈ ప్రత్యేక ఈవెంట్‌కు టెక్ దిగ్గజం యాపిల్, మీడియాకు ఆహ్వానాలు పంపుతుందట. అయితే ఈ ఈవెంట్ దేనికి సంబంధించో తెలుపకుండా యాపిల్ ఆహ్వానం పలుకతుండటంతో, ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, తన తర్వాతి తరం యాపిల్ వాచ్‌లను ఈ ఈవెంట్లోనే ఆవిష్కరించబోతుందని సమాచారం. సెప్టెంబర్ 9 నుంచి వీటి ప్రీ-ఆర్డర్లను యాపిల్ చేపట్టి, సెప్టెంబర్ 16నుంచి విక్రయాలు చేపట్టనున్నట్టు ఫోర్బ్స్ రిపోర్టు తెలిపింది.
ఐఫోన్7 గా వినియోగదారుల ముందుకు రాబోతున్న ఈ ఫోన్, డ్యుయల్ కెమెరా, ప్రెషర్ సెన్సిటివ్ హోమ్ బటన్, బ్లూటూత్ సపోర్టెడ్ హెడ్ ఫోన్స్, డ్యుయల్ స్పీకర్స్, టైప్-సీ ఇంటర్ ఫేస్‌లు ప్రత్యేక ఫీచర్లుగా అలరించబోతున్నాయట. స్క్రీన్కు కింద ఉన్న ఫిజికల్ టచ్ ఐడీ బటన్‌ను తొలగించి, నేరుగా బయోమేట్రిక్ కార్యాచరణతో ఇంటిగ్రేట్ చేయాలని యాపిల్ ప్లాన్ చేస్తోందట.. శాంసంగ్ ఇటీవల లాంచ్ చేసిన గెలాక్సీ నోట్7కు పోటీగా యాపిల్ తన ఐఫోన్‌ను విడుదల చేయనున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ఫోన్ లాంచింగ్‌పై అనేక రూమర్లు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టబోయే ఫోన్ ఐఫోన్ 6ఎస్ఈ అని, పూర్తి రీడిజైన్డ్ ప్రొడక్ట్‌ను 2017లో యాపిల్ పదేళ్ల వార్షిక సందర్భంగా ఆవిష్కరిస్తుందని టెక్ విశ్లేషకులు అంచనావేశారు. ఈ రూమర్లన్నింటికీ సెప్టెంబర్‌లో నిర్వహించబోయే ఈ మెగా ఈవెంట్ చెక్ పెట్టనుంది.