సెప్టెంబర్ 26 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
ఏర్పాట్లపై జేఈవో శ్రీనివాసరాజు తొలి సమీక్ష
తిరుమల: ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు తిరుమల వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల నిర్వహణ కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై తిరుమల జేఈవో కేఎస్. శ్రీనివాసరాజు శుక్రవారం అన్నమయ్య భవన్ అతిథిగృహంలో అన్ని విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. ఉత్సవాల నిర్వహణ కోసం టీటీడీలోని అన్ని విభాగాలు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని ఆదేశాలు ఇచ్చారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని విభాగాలు సమష్టిగా ఉత్సవాలు నిర్వహించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని జేఈవో అధికారులకు సూచన చేశారు.