సార్వత్రిక సమ్మెకు సన్నద్ధం
* రౌండ్‌టేబుల్ సమావేశంలో
కార్మిక సంఘాల నాయకుల పిలుపు
గుంటూరు వెస్ట్: దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 2న సమ్మెకు కార్మికులు సన్నద్ధం కావాలని కార్మిక, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం బ్రాడీపేటలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశానికి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దండా లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపును గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాలని కోరారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ చట్టాన్ని తీసుకు రావాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని చెప్పారు.
31న ర్యాలీలు, ప్రదర్శనలు..
31న మున్సిపల్, మండల కేంద్రాల్లో సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించాలని నాయకులు కోరారు. ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరించి పెట్టుబడిదారులకు దోచిపెట్టే ప్రయత్నాలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకుమాను నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు పాశం రామారావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగూరి రాధాకృష్ణమూర్తి, ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వీ క్రాంతికుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, రైతుసంఘం జిల్లా కార్యదర్శి వై.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.