సెర్బుల హృదయనాదం
సంగ్రామం
సెర్బు జాతీయుల ఇళ్లలో కొన్ని శతాబ్దాల పాటు కనిపించిన సాధారణ దృశ్యమది. మగపిల్లవాడికి మూడు నాలుగేళ్లు వచ్చాక ఓ రోజు అతడి తాతగారు పిలిచి, ప్రార్థన కోసం అన్నట్టు మోకాళ్ల మీద నిలబె డతారు. వాడికి ఎదురుగా రెండడుగుల దూరంలో తాతగారు నుంచుని ‘గుస్లే’వాద్యం మీద కొన్ని పాటలు ఆలపిస్తాడు. చివరిగా, వయోలిన్‌ను పోలి ఉండే ఆ తంత్రీ వాద్య పరికరాన్ని బాలుడి చేత ముద్దాడిస్తారు. అది ‘తన జాతి పట్ల తనకున్న కర్తవ్యాన్ని నెరవేరుస్తాను’ అని ఆ పిల్లవాడు చేసే ప్రమాణం. తన జాతి బానిస చరిత్రతో, వర్తమాన పోరాట క్రమంతో చేసుకునే తొలి పరిచయం. జొవాన్ జొవానొవిక్ అనే సెర్బుకవి ఈ సంప్రదాయాన్ని కవిత రూపంలో గొప్పగా నమోదు చేశాడు.
గుస్లే మోగని ఇల్లు శ్మశానంతో సమానమని సెర్బులు భావించేవారు. సెర్బులంటే ఐరోపా దక్షిణాది స్లావ్ జాతీయులు. ఇళ్లలోనే కాదు, జాతీయ సామాజికోత్సవాలలోనూ గుస్లేని దేవతామూర్తిలా ఆరాధిస్తారు. ముఖ్యంగా జూన్ 28న జరుపుకునే విదోవ్దన్ జాతీయదినంలో గుస్లే ప్రాధాన్యం అపారం. అదే కొసావో దినం. వీటస్డే అని కూడా అంటారు. వేకువకు ముందే నది దగ్గరకు వెళ్లి, ఉదయించే సూర్యబింబానికి ఎదురుగా నిలబడి ‘జాతిని బానిసత్వం నుంచి విముక్తం చేస్తాం’ అని ప్రమాణం చేస్తూ, ఎర్రదారం చేతికి కట్టుకునేవారు.
విదోవ్దన్లో గుస్లేని మోగిస్తూ సెర్బుల వీరగాథ లను ఆలపించేవాళ్లను గుస్లర్లు అంటారు. వీళ్లంతా అంధులే. కానీ ఆ అంధత్వాన్ని ఒక శౌర్య పతకంలా గౌరవిస్తారు. ఎందుకంటే, వీరగాథలు పాడే గుస్లర్ల కళ్లని టర్కీ సైన్యం పెకలించివేసేది. గుస్లేని గన్ధాలో (కమాను)తో మీటిస్తే చాలు సెర్బుల గుండెలు ఉప్పొంగుతాయి. గుస్లర్ల గానంలో విదోవ్దన్ నాటి రాత్రి తడిసిపోతుంది. సెర్బుల నృత్యాలతో గ్రహావా లోయ పులకించిపోతుంది.
‘కొసావో శాపం’ పాటను గుస్లే మీద వింటారు. టర్కుల పాలన నుంచి, అంటే విదేశ పాలన నుంచి సెర్బుల పుణ్యభూమి కొసావోనూ, స్వజాతినీ విముక్తం చేయడానికి జరుగుతున్న యుద్ధంలో పాల్గొననివాళ్లందరికీ ఆ శాపం తగులుతుందని సెర్బుల సిద్ధాంతం. కొసావోను ఒట్టోమాన్ టర్కీ సుల్తాన్ ఆక్రమించాడు. టర్కీకి వ్యతిరేకంగా పూర్వపు సెర్బియా రాజు లాజరస్, అతని అల్లుడు మిలో పోరాడారు. ప్రాణత్యాగం చేశారు. ఇది జూన్ 28, 1389లో జరిగింది. అప్పుడు ప్రారంభించారు సెర్బులు -మాతృభూమి విముక్త పోరాటం. ఆధునిక కాలంలో రైతాంగ పోరాటాల రూపంలో 1807, 1809, 1834, 1852, 1857, 1858లలో పెద్ద పెద్ద తిరుగుబాట్లు జరిగాయి. ప్రతి తరంలోను గుస్లే నాదం వినిపించి, ఈ పోరాటంలో పాల్గొంటానని, కొనసాగిస్తానని సెర్బు బాలల చేత పూర్వీకులతో ఉన్న రక్త సంబంధం మీద ప్రమాణం చేయిస్తారు.
అలాంటి కుటుంబం నుంచీ, అలాంటి గ్రహావో ప్రాంతం నుంచీ వచ్చాడు గవ్రిలో ప్రిన్సిప్.
ఫ్రాంజ్ ఫెర్డినాండ్, ఆయన భార్య సోఫీల మరణం, మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం. ఆ హత్య చేసినవాడు గవ్రిలో. సెర్బుల భూభాగాలు(బాల్కన్ ప్రాంతాలు) 1389 నుంచి టర్కీ పాలనలో ఉండి, 1908లో ఆస్ట్రియా-హంగెరీ ద్వంద్వ రాజరికం కిందకు వచ్చాయి. సెర్బుల పోరాట దిశ కూడా మారింది. 1878లోనే స్వాతంత్య్రం పొందిన సెర్బియా వీరికి అండగా నిలబడింది.
గవ్రిలో జూలై 25, 1894న ఒబ్లజాజ్లో పుట్టాడు. తండ్రి పీటర్ ప్రిన్సిప్. తల్లి మేరియా నానా నీ మిక్సిక్. గవ్రిలో తాత జోవో, పినతండ్రి ఇలిజా, పీటర్ అంతా స్వతంత్ర పోరాటయోధులే. అప్పటి చాలామంది సెర్బు యువకుల్లాగే చరిత్ర, చారిత్రక సాహిత్యం, తత్వశాస్త్రం గవ్రిలో ఇష్టపడ్డాడు. సర్ వాల్టర్ స్కాట్, అలెగ్జాండర్ డ్యూమాస్ అంటే ఇష్టం. గ్రహావో లోయ నుంచి సరాయేవోకు, తుజ్లా, బెల్గ్రేడ్లకు చదువు కోసం వచ్చాడు. అక్కడే బ్లాక్ హ్యాండ్, యంగ్ బోస్నియా సంస్థలలో చేరాడు. ఇవన్నీ సెర్బుల స్వేచ్ఛకోసం, విశాల సెర్బియా కోసం పోరాడుతున్న ఉగ్రవాద సంస్థలే.
సెర్బుల ఆధునిక పోరాటంలో (1908 తరువాతి దశ) తొలి సమిధగా చెప్పే బోగ్డాన్ జెరాజెక్ అంటే గవ్రిలోకు వల్లమాలిన అభిమానం. బోస్నియా-హెర్జిగోవినాలు ఆస్ట్రియా అధీనంలోకి పోయిన తరువాత తొలిసారి 1911లో పార్లమెంటుకు ఎన్నికలు జరిపారు. కొత్త సభ కొలువైన తొలిరోజునే బోగ్డాన్ జెరాజెక్ (స్లోబోదా అనే విప్లవ సంస్థకు చెందినవాడు) అక్కడ ప్రసంగించడానికి వెళుతున్న ఆస్ట్రియా తరఫు గవర్నర్ జనరల్ వెరాసినన్ మీద కాల్పులు జరిపాడు. ఐదు బుల్లెట్లకు కూడా అతడు దొరకలేదు. ఆరో బులెట్‌తో తనను తను కాల్చుకు చనిపోయాడు బోగ్డాన్. గవ్రిలో ఇతడి సమాధి దగ్గరకు వెళ్లి బోగ్డాన్ ఆశయాన్ని కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. చాలా కష్టపడి ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్‌ను హత్య చేయడానికి బెల్గ్రేడ్ నుంచి సిద్ధం చేసిన ముగ్గురు సభ్యుల బృందంలో ఒకడయ్యాడు. సరాయేవోలో అక్కడి నాయకుడు డెనిలో ఇలిక్ మరో ముగ్గురుని తయారు చేశాడు. ఇలిక్ ఒక సెర్బు భాషా పత్రిక సంపాదకుడు. పూర్వాశ్రమంలో ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో అధ్యాపకుడు.
హత్య చేసే రోజుకు గవ్రిలో వయసు పందొమ్మిదేళ్లు. మిగిలిన సభ్యులు కూడా ఇరవై సంవత్సరాల లోపు వాళ్లే. నెడెల్కో కాబ్రినోవిక్ ఇందులో మొదటివాడు. టైప్ సెట్టర్‌గా (అచ్చుపనిలో అక్షరాలు కూర్చడం) పనిచేసేవాడు. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో ఉండగా, ఇతడు పని చేస్తున్న ప్రెస్లోనే అనార్కిస్టు సాహిత్యం అచ్చయ్యేది. అది చదివి ఉగ్రవాదిగా మారాడు. ఒకసారి ఆ పుస్తకాలను బోస్నియాలో ఇంటికి తెస్తే తల్లి తగులబెట్టింది. ఎందుకంటే, ఇతడి తండ్రి ఆస్ట్రియా ప్రభుత్వం తరఫున బోస్నియాలో పని చేస్తున్న గూఢచారి. ట్రిఫ్కో గ్రాబెజ్ ఇంకొక సభ్యుడు. ఇతడి తండ్రి సెర్బ్ ఆర్థడాక్స్ చర్చి పురోహితుడు. ఇలిక్ రూపొందించిన మరో ముగ్గురు సభ్యుల బృందంలో మొదటివాడు మహమ్మద్ మహమ్మద్ బాసిక్. ఇతడికి మొదట బోస్నియా గవర్నర్ జనరల్ పొటియోరిక్ను చంపే బాధ్యతను అప్పగించారు. తరువాత యువరాజునే చంపాలన్న పథకంతో ఆ పనిని నిలిపేశారు. ఇతడు బోస్నియా వాడే. టర్కీ అధికారం కోల్పోయిన తరువాత వీధిన పడ్డ ముస్లిం జమిందారీ కుటుంబాలలో వీళ్లదీ ఒకటి. ఇతడు పెట్టెల సొరుగులు తయారు చేయడంలో దిట్ట. వాసో కుబ్రిలోవిక్, వెజ్కో పొపోవిక్లతో కలిసి బాసిక్ హత్య కుట్రలో పాల్గొన్నాడు.
గవ్రిలో బక్కప్రాణి. అందుకే బాల్కన్ యుద్ధాల (1912-1913)లో సెర్బియా తరఫున యుద్ధం చేద్దామనుకున్నా అవకాశం రాలేదు. ఈ యుద్ధంతోనే తమ చిరకాల వాంఛ విశాల సెర్బియాకు, సెర్బుల విముక్తి లక్ష్యానికి ఎంతో దగ్గరగా వచ్చామని అనుకోవడానికి వీలైంది. ఈ యుద్ధంలో టర్కీ ఓడిపోయింది. అంటే పుణ్యభూమి కొసావో సెర్బుల చేతికి వచ్చింది. ఆ యుద్ధాలలో చాలామంది యంగ్ బోస్నియా సభ్యులు గెరిల్లా దళాలలో (కూమెటీ) పనిచేశారు. కానీ బలహీనుడన్న కారణంగా సెర్బియా పెద్దలు గవ్రిలోను ఎంపిక చేయలేదు. అలాంటివాడు ఆస్ట్రియా యువరాజును హత్య చేశాడు.
సెర్బు యువకులలో ఆవేశం కనిపిస్తుంది. నిజమే! కానీ ఆలోచన లేనివారు మాత్రం కాదు. అంతా విద్యావంతులు. సాహిత్యవేత్తలు. వారి జాతీయవాదానికి ఇదే పునాది. సరాయేవో జంట హత్యలకు సంబంధించి జూలై 5 కల్లా 25 మందిని అరెస్టు చేశారు. గవ్రిలోకు 20 ఏళ్ల శిక్ష వేసి ప్రాగ్ నగరానికి ఉత్తరంగా ఉన్న, శిథిలమైన కోటలో ఉంచారు. ఇదే టెరిజిన్(థెరియసిన్స్టాడ్) కారాగారం. ఇక్కడ దారుణమైన పరిస్థితులు ఉండేవి. చీకటితో, చలిగాలితో, ఏమాత్రం ఎండరాని గదిలో అతడిని ఉంచారు. క్షయ వ్యాధి ముదిరిపోయింది. ఎముకలకు పాకి కుడి చేయి తొలగించవలసి వచ్చింది. బయట ప్రపంచ యుద్ధం మొదలయిపోయింది. ఫెర్డినాండ్ హత్య సెర్బియానీ, సెర్బులనూ ఎన్ని బాధలకు గురి చేస్తోంది... ఆస్ట్రియన్ జైలర్ ఒకరు గవ్రిలోకు చెప్పారు. అందుకు అతడు అన్నమాట- ‘సెర్బియాను ముట్టడించగలరేమోగానీ, జయించలేరు.’ మరో ఆరు మాసాలలో గ్రేట్ వార్ ముగుస్తుందనగా గవ్రిలో ఏప్రిల్ 28, 1918న ఆ జైల్లోనే చనిపోయాడు.
సెర్బుల భూభాగాలను టర్కీ, తరువాత ఆస్ట్రియా కబళించిన మాట నిజం. సెర్బుల పోరాటమంతా ఈ అంశం మీదే. ఆ క్రమంలో ఆస్ట్రియా యువరాజు దంపతుల మీద గవ్రిలో తుపాకీ పేల్చాడు. అది ఆ రెండు దేశాలకూ సంబంధించిన సమస్య. కానీ, ‘ఎ ప్లేస్ ఆన్ ద సన్’ అంటూ రణకండూతితో వేగిపోతున్న జర్మనీకి గవ్రిలో తుపాకీ శబ్దం సేనలను ఉరికించే సంకేతంగా వినిపించింది.
- డా.గోపరాజు నారాయణరావు
....రెండడుగుల దూరంలో తాతగారు నుంచుని ‘గుస్లే’వాద్యం మీద కొన్ని పాటలు ఆలపిస్తాడు.
చివరిగా, వయోలిన్‌ను పోలి ఉండే ఆ తంత్రీ వాద్య పరికరాన్ని బాలుడి చేత ముద్దాడిస్తారు. అది తన జాతి పట్ల తనకున్న కర్తవ్యాన్ని నెరవేరుస్తాను అని ఆ పిల్లవాడు చేసే ప్రమాణం.