సీరియల్ సైనైడ్ కిల్లర్‌కు మరణశిక్ష
సైనైడ్ ఉపయోగించి వరుసపెట్టి హత్యలు చేస్తున్న ఓ హంతకుడికి మూడు హత్య కేసుల్లో కోర్టు మరణశిక్ష విధించింది. సైనైడ్ కిల్లర్ అని పేరున్న మోహన్ కుమార్‌పై నేరం గత మంగళవారం నిరూపితమైంది. నాలుగో అదనపు డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టు శనివారం శిక్ష విధించింది. లీలావతి, అనిత, సునంద అనే ముగ్గురు మహిళలను చంపిన కేసులు అతడిపై రుజువయ్యాయని, అందుకే అతడికి మరణ శిక్ష విధిస్తున్నామని జడ్జి బీకే నాయక్ తెలిపారు.
ఇది అత్యంత అరుదైన కేసని, ఈ నేరానికి మరణశిక్ష కంటే తక్కువ శిక్ష విధించడానికి అవకాశమే లేదని నాయక్ అన్నారు. అయితే.. ఏ కేసులోనూ పోస్టుమార్టం నివేదికలో సైనైడ్ వాడినట్లు రాలేదని మోహన్ కుమార్ వాదించాడు. 2009 అక్టోబర్ 21న అతడిని అరెస్టు చేయగా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో 2011 నవంబర్ నెలలో విచారణ ప్రారంభమైంది. తర్వాత నాలుగో అదనపు డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టుకు కేసు బదిలీ అయ్యింది.