ఏడేళ్ల తర్వాత...
పారిస్: అమెరికా టెన్నిస్ ప్లేయర్ జాక్ సోక్ ఒకే విజయంతో ఎన్నో ఘనతలు సాధించాడు. ఆదివారం ముగిసిన పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ జాక్ సోక్ 5–7, 6–4, 6–1తో క్వాలిఫయర్ క్రాజినోవిచ్ (సెర్బియా)పై గెలిచి విజేతగా నిలిచాడు. తద్వారా తన కెరీర్లో తొలిసారి మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 8,53,430 యూరోల (రూ. 6 కోట్ల 39 లక్షలు) ప్రైజ్‌మనీ సంపాదించాడు. ఏడేళ్ల తర్వాత (2010లో రాడిక్–మయామి ఓపెన్) ఓ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను నెగ్గిన తొలి అమెరికా ప్లేయర్‌గా జాక్ సోక్ గుర్తింపు పొందాడు. యూరోప్ ఆటగాళ్ల 69 మాస్టర్స్ సిరీస్ వరుస టైటిల్స్ విజయాలకు బ్రేక్ వేశాడు. లండన్‌లో సోమవారం మొదలయ్యే సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు కూడా జాక్ సోక్ అర్హత పొందాడు. 1999లో అగస్సీ తర్వాత పారిస్ మాస్టర్స్ టెటిల్ నెగ్గిన తొలి అమెరికా ప్లేయర్‌గా... 2011లో మార్డీ ఫిష్ తర్వాత వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత పొందిన తొలి అమెరికా ప్లేయర్‌గా కూడా జాక్ సోక్ నిలిచాడు.