దేవుళ్లకు కృతజ్ఞతలు..
మోడీ పర్యటనపై భూటాన్ ప్రధాని
న్యూఢిల్లీ: తమ దేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన విజయవంతం కావడంపై భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘‘ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన విజయవంతమైంది. మమ్మల్ని రక్షించే దేవతలకు, మాకు నాయకత్వం వహించే రాజులకు కృతజ్ఞతలు. ఇది మా ప్రజల అదృష్టం’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతకుముందు భూటాన్ నుంచి ఢిల్లీ వచ్చిన వెంటనే నరేంద్ర మోడీ ‘‘ఢిల్లీకి చేరుకున్నాను.
భూటాన్ పర్యటన నా మదిలో ఎప్పటికీ అందమైనదిగా ఉంటుంది. ఈ పర్యటన ఎంతో సంతృప్తివ్వడమే కాదు.. ఫలవంతమైంది కూడా’’ అని ట్విట్టర్లో రాశారు. కాగా, తన అంతరాత్మ ప్రబోధం మేరకే తన తొలి విదేశీ పర్యటనకు భూటాన్ను ఎంచుకున్నానని మోడీ చెప్పిన సంగతి తెలిసిందే. ఆ దేశ పర్యటనకు వెళ్లిన మోడీకి ఘనస్వాగతం లభించిన విషయం విదితమే. సోమవారం భూటాన్ ప్రధాని తోబ్గే తన మంత్రివర్గంతో కలసి విమానాశ్రయం వరకూ మోడీని తోడ్కొని వచ్చి వీడ్కోలు పలికారు.