ఆరేళ్ల తర్వాత క్రికెట్లోకి అజయ్ జడేజా
ముంబై: భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా మరోసారి బ్యాట్ పట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. 42 ఏళ్ల వయస్సులో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ ఆడాలనే లక్ష్యంతో ఆరేళ్ల అనంతరం సీరియస్ క్రికెట్ ఆడాలని జడేజా భావిస్తున్నాడు. 90వ దశకంలో ఈ హర్యానా ఆల్‌రౌండర్ భారత మిడిలార్డర్లో కీలక ఆటగాడిగా సేవలందించాడు.
తాజాగా చెన్నైలో గురువారం ప్రారంభమైన బుచ్చిబాబు ఆలిండియా ఇన్విటేషన్ టోర్నీలో హర్యానాకు నాయకత్వం వహిస్తున్నట్టు ఓ పత్రికలో కథనం వచ్చింది. ఈ టోర్నీలో ప్రతిభ కనబరిచి ఐపీఎల్లో ప్రవేశించాలని భావిస్తున్నట్టు సమాచారం. 2007లో అతడు చివరిసారిగా రంజీ మ్యాచ్ ఆడాడు. 196 వన్డేల్లో ఆరు శతకాలతో 5,359 పరుగులు చేసిన ఈ మాజీ ఆటగాడు 1996 ప్రపంచకప్‌లో అందరి దృష్టిని ఆకర్షించాడు. పాక్‌పై 25 బంతుల్లో 45 పరుగులు చేసి జట్టును గెలిపించడంతో అభిమానుల దృష్టిలో ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. అనంతరం మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఇరుక్కుని ఐదేళ్ల పాటు బీసీసీఐ బహిష్కరణకు గురయ్యాడు.