ఆడపిల్ల పుడితే...
కోసలరాజు ప్రసేనజిత్తు తన ఆస్థానానికి బుద్ధుణ్ణి ఆహ్వానించాడు. బుద్ధుడు వచ్చి ఆసనం మీద కూర్చొని ధర్మ ప్రబోధం చేస్తూ ఉండగా ఒక పరిచారిక పరుగు పరుగున వచ్చి ‘‘మహారాజా! మహారాణిగారు ప్రసవించారు’’ అని చెప్పింది. ఆ వార్త విని ప్రసేనుని ముఖంలో చిరునవ్వు విప్పారింది.
‘‘అవును మహారాజా! రాణి మల్లికాదేవి గారు పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చారు’’ అని చెప్పి పరిచారిక వెళ్లిపోయింది.
ఆ మాటతో ప్రసేనుని ముఖం వాడిపోయింది. ఆడపిల్ల పుట్టిందనే వార్త విని నిర్వేదానికి గురై అలా కూర్చుండి పోయాడు. అది
గమనించిన బుద్ధుడు చిరునవ్వుతో -
‘‘ప్రసేనా! మగబిడ్డ కలగలేదని విచారిస్తున్నావా? ఒక్కోసారి కుమారుని కంటే కుమార్తే మేలు కావచ్చు. విద్యాబుద్ధులు నేర్పితే ఆమె మగపిల్లాడినే మించిపోగలదు. వీర నారి కాగలదు. ఆదర్శమాతగానూ రాణించవచ్చు. నీ రాజ్యాన్ని దక్షతగా పాలించనూ గలదు. ఆడపిల్ల ఎందులోనూ తీసిపోదు. అంతేకాదు, మానవజాతికి మూలం, దాని అభివృద్ధి స్థానం మహిళే అని మరిచిపోవద్దు’’ అని హితోపదేశం చేశాడు.
బుద్ధుని ఉపదేశం విన్న ప్రసేనుని వదనంలో తిరిగి ఆనందం తొంగిచూసింది.
- బొర్రా గోవర్ధన్