శ్రీవారి సేవకుల గదిలో చోరీ
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామి సేవకు వచ్చిన సేవకుల గదిలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గుంటూరుకు చెందిన చంటిబాబు(50) 15 మందితో కలసి శ్రీవారి సేవ కోసం సోమవారం తిరుమలకు వచ్చారు. ఏఎన్సీ(అంజనాద్రి కాటేజి)లోని 403బీ గదిని అద్దెకు పొందారు. మంగళవారం సేవను ముగించుకుని మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి గదికి చేరుకున్నారు. ఆ సమయంలో చంటిబాబు బాత్రూంలో ఉండగా, మరో వృద్ధురాలు నిద్రపోతోంది.
గుర్తుతెలియని వ్యక్తి గదిలోకి ప్రవేశించి చార్జింగ్‌లో ఉన్న మూడు సెల్ఫోన్లు, నగదు, ఏటీఎమ్ కార్డు, విలువైన పత్రాలు కలిగిన హ్యాండ్ బ్యాగ్‌ను అపహరించుకుపోయాడు. బాత్రూం నుంచి వచ్చిన చంటిబాబు వృద్ధురాలిని నిద్రలేపి సెల్ఫోన్ల గురించి ఆడగాడు. తనకు తెలియదని బదులివ్వడంతో గదిలో దొంగతనం జరిగినట్టు చంటిబాబు గుర్తించారు. అనంతరం తిరుమల క్రైం స్టేషన్‌కు చేరుకుని చోరీ విషయమై ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు సేకరించిన సీఐ రవిమనోహరాచారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.