ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్ విడుదల చేయాలి
గుంటూరు (అరండల్‌పేట) :
రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు 13వేల మంది ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్‌ను వెంటనే విడుదల చేయాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బి.హైమారావు కోరారు. శుక్రవారం నగరంలోని ఇన్నర్రింగ్లో ఉన్న సీడీఎంఏ కార్యాలయంలో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కె.కన్నబాబును ఆయన కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హైమారావు మాట్లాడుతూ సర్వీసు రూల్స్ లేకపోవడం వల్ల ఉపాధ్యాయులు నష్టపోతున్నారని, జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని, పండిట్స్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులకు గజిటెడ్ హాదా కల్పించాలని కోరారు. దీనిపై కన్నబాబు స్పందిస్తూ మున్సిపల్ సర్వీసు రూల్స్ న్యాయశాఖ ఆమోదం పొంది సీఎం పేషీకి చేరాయని, ముఖ్యమంత్రి ఆమోదం పొందగానే సర్వీసు రూల్స్ విడుదల చేస్తామన్నారు.