దసరా ఉత్సవాలకు సేవా కమిటీ ఏర్పాటు ఉసూరుమన్న తెలుగు తమ్ముళ్లు
ఉత్సవ కమిటీపై టీడీపీ నేతల ఆశలు
సేవా కమిటీని నియమిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ
36 మందితో జంబో కమిటీ ఏర్పాటు
సాక్షి, విజయవాడ : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం ఉత్సవ కమిటీ వేస్తుందనే తెలుగు తమ్ముళ్ల ఆశ నిరాశగా మారింది. ఈ ఏడాది ఉత్సవ కమిటీ అవసరం లేదని టీడీపీకి చెందిన భక్తుల సేవల్ని మాత్రమే వినియోగించుకోవాలంటూ ప్రభుత్వం చేసిన సూచనతో బుధవారం దేవాదాయశాఖ ఉపకమిషనర్ ఎం.ఎల్. నాగమణి 36 మంది సభ్యులలో జాబితాను విడుదల చేశారు. గురువారం ఆ ఉత్తర్వులు దేవస్థానానికి చేరాయి. ఉత్తర్వులు ప్రకారం సభ్యులు దసరా ఉత్సవాలు తొలిరోజు నుంచి చివర రోజు (ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3)వరకు మాత్రమే భక్తులకు సేవలందిస్తారు.
పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట
గతంలో కాంగ్రెస్, వైఎస్సార్ సీపీల్లో పనిచేసి ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చిన వారికి అవకాశం కల్పించారని పలువురు తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. సినీ నటుడు హరికృష్ణతో అత్యంత సన్నిహితంగా ఉన్నవారికి, గొడవల్లో తలదూర్చేవారికి అవకాశం కల్పించినట్లు విమర్శిస్తున్నారు. పార్టీలో తొలి నుంచి జెండా మోసిన వారికి కాకుండా అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమాలు సిఫార్సులు చేసిన వారికే అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. కేవలం తొమ్మిది రోజుల కోసం ఉండే కమిటీ కాడంతో నేతలు కూడా పట్టుబట్టలేదని సమాచారం.
అప్పటికప్పుడు చేసే దేమిటీ ?
దేవాదాయశాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులలో సభ్యుల్ని సేవలను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు వినియోగించుకోవాలో పేర్కొన్నారు. ఉత్సవాల ప్రారంభం రోజున వచ్చి అప్పటికప్పుడు భక్తులకు తాము ఎలా సేవలందిస్తామని కమిటీలో నియమితులైన వారు అంటున్నారు.
సేవా కమిటీలో సభ్యులు వీరే
సేవా కమిటీలో బడేటి ధర్మారావు, ఇమ్మిడిశెట్టి శ్రీనివాసరావు, ఎన్.సి.భాను సింగ్, గంటా కృష్ణమోహన్, పి.భానుప్రకాష్, టి. శ్రీనివాసులు, బొబ్బా వాసుదేవ చౌదరి, సుంకర కృష్ణ, సీహెచ్ రామ్మోహన్, పోలవరపు శశికళ, అనుముల వి.వి.లక్ష్మణరావు, శీరంశెట్టి పూర్ణచంద్రరావు, సారేపల్లి రాధాకృష్ణ, గంటిగన్పు వెంకటేశ్వర్లు, నారిండి వెంకటరావు, సోమారామ్, గెహలోత్, సాదరబోయిన ఏడుకొండలు, నాగోతి నరసింహారావు, రావూరి సత్యనారాయణ, వెలగపూడి శంకరబాబు, కూనపరెడ్డి శ్రీనివాస్, చిగురుపాటి కుమారస్వామి, మేకల నాగేశ్వరరావు, చింతా శ్రీనివాసరావు, పడాల కన్నా, అవిర్నేని కరుణకుమార్, యలమంచిలి వెంకట నరసింహారావు, సగ్గుర్తి రమేష్, అరేపల్లి సోమేశ్వరరావు, చలసాని రమణారావు, గుమ్మడి కృష్ణారావు, కొడాలి సాయిబాబా, అన్నాబత్తుని శ్రీదేవి, మోర్ల సుబ్బారావు, పెద్ది రామారావు నియమితులయ్యారు.