service tax raids
-
నగరంలో హడలెత్తించిన జీఎస్టీ దాడులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తోపాటు నగరంలోని 23 ప్రాంతాల్లో జీఎస్టీ అధికారులు శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. రూ.కోట్లలో సర్వీస్ ట్యాక్స్, జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు జూబ్లీహిల్స్‌లోని ఓ వర్ధమాన సినీనటి నివాసంపై దాడులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న సదరు హీరోయిన్ షూటింగ్ రద్దు చేసుకుని ఇంటికి చేరుకున్నారు. ఆ నటి రూ.20 లక్షల వరకు ట్యాక్స్ చెల్లించాల్సి ఉందని సమాచారం. చిట్‌ఫండ్, కోల్డ్ స్టోరేజీ యూనిట్లు, సాఫ్ట్వేర్ కంపెనీలు, కన్స్ట్రక్షన్ కంపెనీలతోపాటు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు, తదితర ఆఫీసుల్లో ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. ఎంబీబీఎస్ సీట్ల కోసం విద్యార్థులను విదేశాలకు పంపే కన్సల్టెన్సీలు భారీగా జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించారు. బుధవారం నుంచి జీఎస్టీ అధికారులు జంటనగరాల్లో దాడులు జరుపుతున్నారు. వీటిలో ఓ సినీనటుడి వ్యాపార సంస్థలతోపాటుగా పలు మౌలిక సదుపాయాల కంపెనీలు, ఇంటర్నేషనల్ స్కూళ్లు, స్టీలు వ్యాపారాలపై బుధవారం చేసిన దాడుల్లో దాదాపు రూ.40 కోట్ల పన్ను ఎగ్గొట్టినట్లుగా గుర్తించారు. -
కోచింగ్ సెంటర్‌పై ట్యాక్స్ అధికారుల దాడులు
హైదరాబాద్ : ఎస్సార్‌నగర్‌లో ఉన్న సీఎంఎస్ ప్రొఫెషనల్ అకాడెమీ ఫర్ సీఏపై బుధవారం సర్వీస్ ట్యాక్స్ అధికారులు దాడులు చేశారు. రూ.1.5 కోట్లకు పైగా ఈ సంస్థ బకాయి ఉన్నట్లు చెబుతున్న సర్వీస్ ట్యాక్స్ (ఎస్టీ) అధికారులు సోదాల్లో భాగంగా కొన్ని పత్రాలతో పాటు రూ.13 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంస్థపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఎస్టీ అధికారులు సమన్లు జారీ చేయడం ద్వారా యాజమాన్యాన్ని ప్రశ్నించాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో ఎనిమిది బ్రాంచిలను నిర్వహిస్తున్న సీఎంఎస్ ప్రొఫెషనల్ అకాడెమీ ఫర్ సీఏ ఎస్సార్‌నగర్ కేంద్రంగా కార్యకలాపాలు నడిపిస్తోంది. ఈ సంస్థ మూడేళ్ళ క్రితం సర్వీస్ ట్యాక్స్ విభాగం వద్ద కేంద్రీకృత రిజిస్ట్రేషన్ చేయించుకుంది. దీనిప్రకారం ప్రతి బ్రాంచ్ కార్యకలాపానికి సంబంధించిన సర్వీస్ ట్యాక్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, చెల్లించకపోవటంతో ఎస్టీ విభాగం నోటీసులు జారీ చేసింది. స్పందన లేకపోవడంతో బుధవారం దాడులు జరిపింది. ఈ కేసుల్లో నేరం నిరూపితమైతే ఏడేళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశం ఉందని సమాచారం.