జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సేవలు నిల్
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లా ఆస్పత్రికి రోజూ 600 మంది వరకు అవుట్ పేషెంట్లు వస్తున్నారు. 350 వరకు ఇన్‌పేషెంట్లు ఉంటున్నారు. రోజూ అత్యవసర సేవల కోసం 25 నుంచి 30 మంది వరకు వస్తుంటారు. వీరికి సేవలందించడానికి వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి. కానీ డ్యూటీ డాక్టర్ మాత్రమే ఉంటున్నారు. ఆస్పత్రిలో అన్ని విభాగాలలో సిబ్బంది కూడా తక్కువగానే ఉన్నారు.
ఆస్పత్రిలో 130 స్టాఫ్‌నర్సు పోస్టులుండగా 32 మంది మాత్రమే ఉన్నారు. 250 వరకు సిబ్బంది, నాలుగో తరగతి ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు అవసరం కాగా 19 మంది మాత్రమే సేవలందిస్తున్నారు. వీరి సేవలూ అన్ని విభాగాలకు అందుబాటులోకి రావడం లేదు. అత్యవసర సేవల కోసం వచ్చేవారికి కుట్లు, కట్లు వేయడం కోసం వైద్యసిబ్బందికీ కొరత ఉంది. ఒకేసారి అత్యవసర చికిత్స కోసం మూడు నుంచి నాలుగు కేసుల వరకు వచ్చినపుడు పరిస్థితి దారుణంగా ఉంటోంది. దీంతో రోగుల బంధువులు వైద్యులు, వైద్యసిబ్బందితో తరచూ వాగ్వాదానికి దిగుతున్నారు.
అందుబాటులో ఉండని వైద్యులు
ఆస్పత్రిలో రోగులకు వైద్యసేవలు అందించడానికి వైద్యులు సైతం అందుబాటులో లేరు. రోజు ఉదయం 9 గంటల నుంచి 12.30 గంటల వరకు ఓపీ సేవలకోసం వేచి చూడాల్సిందే.. వైద్యులు ఇష్టానుసారంగా ఆస్పత్రికి వస్తుండడంతో రోగులకు సరైన సేవలు అందడం లేదు. జిల్లా ఆస్పత్రిలో 36 మంది వైద్యులు ఉండాలి. కానీ, 14 మందే ఉన్నారు. మెడికల్ కళాశాలకు సంబంధించి 66 మంది ప్రొఫెసర్లు ఆస్పత్రిలో సేవలందించాల్సి ఉండగా, 18 మందికి మించి విధులకు హాజరు కావడం లేదు. మిగతా ప్రొఫెసర్లు ఆస్పత్రి వైపే కన్నెత్తి చూడడం లేదు. ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడంతో ప్రొఫెసర్లలో మార్పు రావడం లేదు.
సమస్యలపై స్పందన కరువు
ఆస్పత్రిలోని సమస్యలను పరిష్కరించడానికి అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రికి రెగ్యులర్ సూపరింటెండెంట్, డీసీహెచ్ఎస్, ఆర్ఎంఓ లేకపోవడంతో స్థానిక వైద్యులు సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదన్న విమర్శలున్నాయి. ఆయా పోస్టులలో రెగ్యులర్ అధికారులను నియమిస్తే ఆస్పత్రి పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశాలున్నాయి.
వెంటిలేటర్ సౌకర్యం లేదు
ఆస్పత్రిలో వెంటలేటర్ సౌకర్యం లేకపోవడం పెద్ద లోటు. దీంతో వెంటిలేటర్ అవసరమైన రోగిని ఇతర ఆస్పత్రికి తరలించాల్సి వస్తోంది. గతంలో నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి సంఘం సమావేశంలో అప్పటి కలెక్టర్ దీనిపై దృష్టి సారించారు. వెంటిలేటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అయినా ఇప్పటికీ ఆస్పత్రిలో ఆ సౌకర్యం ఏర్పాటు కాలేదు. జిల్లా ఆస్పత్రిలో అంబులెన్స్ కూడా లేదు.
పోస్టుమార్టం కోసం ప్రత్యేక డాక్టర్‌ను నియమించినా, ఆయన ఆస్పత్రి వైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రస్తుతం ఆస్పత్రికి వచ్చే వైద్యులు, ప్రొఫెసర్లే అత్యవసర సేవలు, వైద్య సేవలు, పోస్టుమార్టం తదితర సేవలు అందించాల్సి వస్తోంది. దీంతో వారిపై అదనపు భారం పడుతోంది. ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, సరైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.