సర్వీస్ ట్యాక్స్ పెంపు నేటినుంచి అమలు
మూడు నెలల క్రితం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో పేర్కొన్నట్లు జూన్ 1 (సోమవారం) నుంచి సర్వీస్ ట్యాక్స్ (సేవల పన్ను) 14 శాతం పెరగనుంది. గతంలో ఇది 12.36 శాతంగా ఉండేది. రైలు, విమానం టికెట్లు, బ్యాంకు సేవలు, క్రెడిట్ కార్డులు, బీమా, ప్రకటనలు, టూర్, ఈవెంట్ మేనేజర్స్ తదితరాలు 14 శాతం సేవల పన్ను కిందికి వస్తుండటంతో ఆయా సర్వీసులు ఇక మరింత ప్రియం కానున్నాయి.
రైలులో ఏసీ బోగీలో ప్రాయాణం, సరుకు రవాణాల రుసుము నేటి నుంచి 0.5 శాతం పెరిగాయి. ఇప్పటివరకు టికెట్ విలువలో 30 శాతంపై 12.36 శాతం సేవపన్ను వసూలు చేస్తోన్న సంగతి తెలిసిందే. నికరంగా 3.7 శాతం ఉన్న పన్ను.. ఇకపై 4.2 శాతానికి పెరగనుంది.
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను సజావుగా అమలుచేసేందుకు వీలుగా సేవల పన్ను పెంచక తప్పదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. కొన్నిరకాల సేవలపై 2 శాతం స్వచ్ఛ భారత్ సెస్ ను కూడా విధించనున్న ప్రభుత్వం.. ఆ నిర్ణయం ఎప్పటినుంచి అమలవుతుందో పేర్కొనలేదు.