‘ఎర్ర’ స్మగ్లర్‌కు యువనేత రక్షణ!
- శేషాచలం ఎన్‌కౌంటర్‌పై దారి తప్పిన దర్యాప్తు
- ఒత్తిళ్లకు తలొగ్గిన ‘సిట్’
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శేషాచలం ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు దారి తప్పిందా? విచారణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) యువనేత ఒత్తిళ్లకు తలొగ్గిందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎర్ర చందనం వృక్షాలను నరికే కూలీలను తమిళనాడు నుంచి శేషాచలం అడవులకు రప్పించిన కీలక స్మగ్లర్‌ను సిట్ అధికారులు ఇప్పటికీ విచారించలేదు.
చిత్తూరు జిల్లాకు చెందిన అధికార టీడీపీ కీలక నేత ఒకరు ఎర్రచందనం స్మగ్లింగ్‌లో దిట్ట. యువనేతకు సన్నిహితుడైన ఆ నాయకుడు.. ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో టీడీపీకి ఆర్థికంగా అండగా నిలిచారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పచ్చ స్మగ్లర్ ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా సాగుతోంది. ఆయనే తమిళనాడు నుంచి దళారీల ద్వారా ఏప్రిల్ 6న కూలీలను రప్పించారు. వారిని చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో పోలీసులు అదే రోజున అదుపులోకి తీసుకుని.. ఏప్రిల్ 7న ఎన్కౌంటర్ చేశారని తమిళనాడు ప్రజా సంఘాలు ఆరోపించాయి.
దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగితే తనకు సన్నిహితుడైన స్మగ్లర్‌కు ఇక్కట్లు తప్పవని భావించిన యువనేత ‘సిట్’ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. దాంతో సిట్ అధికారులు స్మగ్లర్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.