బాలికపై అత్యాచారం.. సజీవదహనం
దేశ రాజధాని పరిసరాల్లో ఆడవాళ్లకు భద్రత లేకుండా పోతోంది. ఢిల్లీ శివార్లలోని నోయిడాలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆమెను సజీవదహనం చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో తమ ఇంటి మేడ మీదే ఆమె అరుపులు వినిపించడంతో తల్లిదండ్రులు పరుగున అక్కడకు వెళ్లేసరికి ఆమె అగ్నికీలలకు ఆహుతవుతూ ఉంది. 95 శాతం వరకు కాలిన గాయాలు కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమెపై అత్యాచారం చేశాడని భావిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
వైద్య నివేదికల కోసం తాము ఎదురుచూస్తున్నామని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. పదోతరగతి చదువుతున్న ఆ అమ్మాయి.. 20 ఏళ్ల వ్యక్తి తనను వేధిస్తుండటంతో స్కూలుకు వెళ్లడం కూడా మానేసింది. అయినా ఆమెపై వేధింపులు ఆగలేదు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు చికిత్స చేయడం కూడా కష్టంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆమెకు పెద్దడోసులో యాంటీబయాటిక్స్ ఇస్తున్నామని, శరీరంలో ఇన్ఫెక్షన్ వ్యాపిస్తే మల్టీఆర్గాన్ ఫెయిల్యూర్ ఏర్పడే ప్రమాదం ఉన్నందున అలా జరగకుండా ప్రయత్నిస్తున్నామని ఓ వైద్యుడు చెప్పారు.