లిఫ్టుల ఏర్పాటు ఈజీ
అఫిడవిట్ దాఖలును రద్దుచేసిన డీడీఏ
డీడీఏ నిర్మించిన ఫ్లాట్లలో నివసిస్తున్నవారికి శుభవార్త. ఈ భవనాల్లో అవసరమని భావించినవారు లిఫ్టులను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకోసం డీడీఏ నుంచి ఎటువంటి అనుమతి పొందాల్సిన అవసరమే లేదు.
న్యూఢిల్లీ: ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) నిర్మించిన ఫ్లాట్లలో లిఫ్టుల ఏర్పాటు సులభతరంగా మారింది. ఇందుకోసం ఈ సంస్థకు ఇకమీదట ఎటువంటి అఫిడవిట్‌నూ దాఖలు చేయాల్సిన అవసరమే లేదు. ఆయా ఫ్లాట్లలో ఏమైనా మార్పులుచేర్పులను చేపట్టాలంటే ముందుగా డీడీఏకి ఓ అఫిడవిట్‌ను విధిగా దాఖలు చే యాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను డీడీఏ రద్దు చేసింది. దీంతో లిఫ్టు ఏర్పాటుకు ఎటువంటి ఆటంకాలు ఎదురుకాబోవు. లిఫ్టుల ఏర్పాటుకు సంబంధించి ఈ నిబంధన అవరోధంగా పరిణమించింది.
దీంతో గత కొన్ని నెలలుగా అనేక రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రాలను సమర్పించారు. అంతేకాకుండా ఈ నిబంధనను రద్దు చేయాలంటూ పట్టణ అభివృద్ధి శాఖకు లేఖలు రాశారు. ఆది నుంచి ఈ నిబంధన ఆటంకంగా పరిణమించినందువల్ల గతంలో నిర్మించిన భవనాల్లో లిఫ్టుల ఏర్పాటు సాధ్యం కాలేదంటూ వాదించాయి. ఈ విషయంలో సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించారని ఆరోపించాయి. లిఫ్టులకు సంబంధించిన విధానాన్ని డీడీఏ గతంలో అనేక పర్యాయాలు మార్పులుచేర్పులు చేసింది. చివరిగా ఈ నెల ఒకటో తేదీన కూడా సవరణలు చేసింది. లిఫ్టులను ఏర్పాటు చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) పొందాల్సిందేనని పేర్కొంది.
ఈ విషయమై డీడీఏ ఉపాధ్యక్షుడు బల్వీందర్‌కుమార్ మాట్లాడుతూ ఫ్లాట్లలో నివసించేవారికి అనుగుణంగా నిబంధనల్లో మార్పులుచేర్పులు చేస్తున్నామన్నారు. అనధికార నిర్మాణాలనేది మరొక అంశమని, దానిని దీనితో ముడిపెట్టలేమని అన్నారు. తాము నిర్మించిన ఫ్లాట్లలో నివసించేవారికి సంబంధించి ఏ ప్రక్రియ అయినా సులభతరంగా ఉండేవిధంగా చేయాలనేదే తమ ఉద్దేశమన్నారు. ఈ నిబంధన ఎత్తివేతకు మరేదైనా కారణం ఉందా అని ప్రశ్నించగా అటువంటిదేమీ లేదన్నారు. ఈ విషయమై అనేక పర్యాయాలు అయా ఫ్లాట్లలో నివసించేవారితో సంప్రదింపులు కూడా జరిపామన్నారు. కాగా లిఫ్టుల ఏర్పాటులో ఆంక్షల రద్దు వల్ల దాదాపు నాలుగు లక్షలమంది లబ్ధి పొందనున్నారు.