సెటిలర్ల వల్లే హైదరాబాద్ అభివృద్ధి: ఎంపీ రేణుకా
హైదరాబాద్: సెటిలర్ల వల్లే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. గతంలో సెటిలర్లను దూషించినందకుగానూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లో రేణుకా మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేస్తున్న తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ముందుగా రాజీనామా చేసి తర్వాత ఎన్నికల ప్రచారం చేయాలని అన్నారు. రామోజీఫిల్మ్ సిటీని నాగళ్లు, ట్రాక్టర్లతో దున్నిస్తానంటూ.. అయ్యప్పసిటీ భవానాలను కూల్చడం వల్లే సెటిలర్లకు అభద్రతా భావం పెరిగిపోయిందని విమర్శించారు.
సెటిలర్లకు అండగా నిలిచేది కాంగ్రెస్సే అని అందరూ గమనిస్తున్నారని చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంటు, 104, 108 వైద్య సేవల్లో కేసీఆర్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలు, మహిళలపై దాడులలో కూడా కేసీఆర్ ప్రభుత్వం సాధించిందేమీ లేదని ధ్వజమెత్తారు. వివిధ రాష్ట్రాల స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఆ టెండ్రు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొనసాగుతుందని రేణుకా చౌదరి తెలిపారు.