చిన్నా, పెద్ద చూడను!
కోలీవుడ్లో అరుదుగా మెరిసే ఈ మలయాళీ బ్యూటీ రమ్యా నంబీశన్.. మంచి గాయని కూడా అన్న విషయం తెలిసిందే. అయితే తన తీయని గొంతునూ చాలా పరిమితంగానే ఉపయోగిస్తోంది. అడిగితే గాయనిగా అవకాశాలు రావాలిగా అంటూ ఎదురు ప్రశ్నస్తిస్తున్నారు. అయితే కోలీవుడ్లో ఈ అమ్మడికి విజయాల శాతం మాత్రం చెప్పుకోతగ్గట్టుగానే ఉంది. ఆ మధ్య పిజ్జా, సేతుపతి వంటి చిత్రాలతో సక్సెస్ను అందుకున్న రమ్యానంబీశన్ తాజాగా నట్పు ఎన్నను తెరియుమా చిత్రంతో సక్సెస్ను అందుకున్నారు. ఈ చిత్ర సక్సెస్ మీట్లో ఈ అమ్మడిని పలకరించగా చాలా విషయాలను చెప్పుకొచ్చారు. అవేంటో చూద్దాం.
పెద్ద హీరోలు, చిన్న హీరోలన్న తారతమ్యం లేకుండా నటించేస్తున్నారే?
చిన్నా, పెద్ద అన్న తేడాలను చూడను. నటిగా పాత్ర బాగుంటే నటించడానికి సై అంటాను. సేతుపతి చిత్రం తరువాత ఎక్కువగా అమ్మ పాత్రలే వస్తుండడంతో వాటిని అంగీకరించలేదు. ఈ నట్పు ఎన్నను తెరియుమా చిత్రంలో నా పాత్రకు ప్రాముఖ్యత ఉండడంతో అందరూ కొత్తవారైనా నటించడానికి ఓకే చెప్పాను. అమ్మ పాత్రల్లో నటించడం కంటే ఇలాంటి నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించడానికి ఇష్టపడుతున్నాను.
సరే. ఎక్కువగా అతిథి పాత్రల్లో కనిపించడానికి కారణం?
కారణం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. స్నేహం కోసమే. అయినా ఇప్పుడు తనను అతిథి నటిగా మార్చేస్తారేమోనన్న భయం కలుగుతోంది. ఇకపై అతిథి పాత్రల్లో నటించడాన్ని తగ్గించుకుంటాను. నచ్చిన కథా పాత్రల్లోనే నటించాలని నిర్ణయం తీసుకున్నాను.
తదుపరి చిత్రం?
ప్రస్తుతం విజయ్ఆంటోనికి జంటగా తమిళరసన్ చిత్రంలో నటిస్తున్నాను. దీనికి ఇళయరాజా సంగీతం అందించడం విశేషం
ఇళయరాజా సంగీతంలో పాడనున్నారా?
నిజం చెప్పాలంటే ఆయన సంగీతదర్శకత్వంలో పాడాలంటే నాకు భయం. ఇళయరాజా 75 అభినందన వేదికపై ఆయన సమక్షంలో పాడే అవకాశం రావడమే భాగ్యంగా భావిస్తున్నాను.
ఇటీవల పాడడం తగ్గించినట్లున్నారే?
పాడడం అంటే నాకిష్టం. అయితే అవకాశాలు రావడం లేదన్నదే నిజం.