బలిజ కులస్తులు ఆర్థికంగా ఎదగాలి
పెనగలూరు:
రాజకీయంగా, ఆర్థికంగా బలిజ కులస్తులు ఎదగాలని బలిజ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం బలిజ సంఘం సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పెనగలూరు హైస్కూల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాపుకార్పొరేషన్ డైరక్టర్ మోదుగుల పెంచలయ్య మాట్లాడుతూ జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో బలిజలు అధికంగా ఉన్నారని, నాలుగు ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ
సీటుకు పోటీ చేసేటట్లు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. కాపు కార్పొరేషన్ ద్వారా బలిజలకు మేలు జరుగుతుందని, వచ్చే సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరికి లక్షరూపాయలు రుణాలు ఇచ్చేటట్లు ముఖ్యమంత్రితో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం మాత్రమే రూ.60వేలు లోను ఇస్తారని తెలిపారు.
ఐదు మంది కమిటీగా ఏర్పడితే రూ.10లక్షలు వరకు రుణసదుపాయం వచ్చేటట్లు ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు. బలిజ కులస్తుంతా ఏకతాటిపై నిలబడాలన్నారు. మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య మాట్లాడుతూ బలిజలను కాంగ్రెస్ పార్టీ వాడుకుని వదిలేసిందన్నారు. బలిజలను బీసీలో చేర్చితే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఇతరులకు సహకారం అందించినప్పుడే మనం రాజకీయంగాను, ఆర్థికంగాను ఎదుగుతామన్నారు.విబేధాలు, ద్వేషాలు మరిచి ఐకమత్యంగా ఉండాలని సూచించారు. అంతకు ముందు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటికే కాపు కార్పొరేషన్ ద్వారా బలిజలు ఒక అడుగు ముందుకు వేశారన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత బలిజలు 17శాతం నుంచి 27శాతంకు పెరిగారన్నారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు అత్తికారి వెంకటయ్య, చలపతి, చిట్వేలి మస్తాన్, పెనగలూరు మండల బలిజ సంఘం అధ్యక్షుడు నగిరి సుబ్బరాయుడు, వైస్ ప్రెసిడెంట్ కత్తి సుబ్బరాయుడు, ప్రధాన కార్యదర్శులు కానాల శంకరయ్య, జిలకర సుబ్బయ్య, బలిజసంఘం నాయకులు పాల్గొన్నారు.