వరంగల్‌కు ఏడుగురు కేంద్ర మంత్రులు!
* ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ
* కేసీఆర్‌పై వ్యూహాత్మక దాడికి కమల దళం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. వరంగల్ స్థానాన్ని గెలుచుకోవాలనే పట్టుదలతో బీజేపీ రాష్ట్ర కమిటీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అభ్యర్థి ఎంపికపై ఇప్పటికే వడపోతకు దిగిన కమల దళం.. అభ్యర్థి ఎంపిక కోసం వేచిచూడకుండా పార్టీ శ్రేణులను ఉపఎన్నిక కోసం సమాయత్తం చేసే చర్యలను ప్రారంభించనుంది.
వరంగల్ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కార్యకర్తలతో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 5 దాకా సమావేశాలు నిర్వహించనుంది. వారంపాటు జరిగే ఈ సమావేశాలకు ఏడుగురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. దీనికి కొనసాగింపుగా ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక కేంద్ర మంత్రి కనుసన్నల్లో ఉప ఎన్నికను ఎదుర్కోవాలని పార్టీ భావిస్తోంది. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, ఎం.వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కారీ, సంతోష్ గంగ్వార్, హన్స్‌రాజ్ గంగారాం, బండారు దత్తాత్రేయ, చౌదరి బీరేందర్‌సింగ్ ఈ అసెంబ్లీ స్థాయి పార్టీ సమావేశాలకు హాజరుకానున్నారు.
మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్పై వ్యూహాత్మక దాడి చేయాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. పలు కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోకుండా బీజేపీకి పేరు రావొద్దనే కుట్రతో పనులను కూడా అడ్డుకుంటోందని టీఆర్ఎస్ను విమర్శించాలని సంకల్పించింది. యాదాద్రి నుంచి హన్మకొండ దాకా 99 కిలోమీటర్ల జాతీయ రహదారి కోసం కేంద్రం రూ.1,900 కోట్లు మంజూరు చేయడం, ఈ నెల తొలి వారంలోనే శంకుస్థాపన జరగాల్సి ఉన్నా సీఎం అడ్డుపడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ రోడ్డు పరిస్థితిని రాష్ట్ర ప్రజలకు వివరించడానికి కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ వస్తున్నట్టుగా బీజేపీ రాష్ట్ర నేతలు వెల్లడించారు. మరోవైపు వరంగల్‌కు వారసత్వ నగరం, స్మార్ట్ సిటీ, అమృత్ పథకం వంటి వాటి ద్వారా అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో వరంగల్ పట్టణంలో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.
పత్తి రైతుల కోసం పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న చేనేతశాఖ నుంచి సంతోష్ గంగ్వార్, అభివృద్ధి నమూనా కోసం దేశంలోనే మూడు మండలాల్లో వర్ధన్నపేటలోని పర్వతగిరిని ఎంపిక చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి ఆ శాఖ మంత్రి చౌదరి బీరేందర్‌సింగ్ ఒక సమావేశానికి హాజ రవుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఈ సమావేశాలను ఏర్పాటు చేయనుంది.