అప్పట్లోనూ నల్లకుబేరులు..
నల్లడబ్బు బెడద ఇప్పుడే కాదు, పదిహేడో శతాబ్దం నాటికే ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా ఉండేది. రహస్యంగా డబ్బు కూడబెట్టుకుని, బయటకు సామాన్యంగా కనిపించే ‘పెద్ద’మనుషుల నుంచి పన్నులు వసూలు చేయడం మరింత గడ్డు సమస్యగా ఉండేది. ఇలాంటి వాళ్ల నుంచి ప్రభుత్వానికి ఆదాయాన్ని రాబట్టేందుకు 1696లో అప్పటి ఇంగ్లాండ్ ప్రభుత్వం ‘కిటికీ పన్ను’ను అమలులోకి తెచ్చింది. భవంతులకు ఉన్న కిటికీల సంఖ్య ఆధారంగా పన్ను వసూలు చేసేవారు.
ఇంగ్లాండ్ బాటలోనే స్కాట్లాండ్, ఫ్రాన్స్ కూడా ఈ పన్నును అమలులోకి తెచ్చాయి. ఎక్కువ కిటికీలు ఉన్న ఇళ్లలో నివసించేవారు సహజంగానే ధనవంతులై ఉంటారని అప్పటి సర్కారు నమ్మకమే కాదు, అది కొంతవరకు నిజం కూడా! అయితే, శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్లు తెలివి మీరిన నల్లకుబేరులు తమ భారీ భవంతులకు పరిమితికి మించి ఉన్న కిటికీలను పూర్తిగా మూసేయించుకునే వారు. కిటికీలపై పన్ను విధించడమంటే ప్రజలకు ఆరోగ్యంగా జీవించే హక్కును దారుణంగా కాలరాయడమేననే విమర్శలు రావడంతో చివరకు ఇంగ్లాండ్ ప్రభుత్వమే దిగివచ్చి, ఈ పన్నును 1851లో రద్దు చేసింది.