ఏంజెలినా జోలీకి ఏడో పాప
మూడు దేశాలు, మూడు జాతులకు చెందిన పిల్లలను దత్తత తీసుకొని జాతులే కాదు దేశాల సరిహద్దులకు కూడా తాను అతీతమని నిరూపించుకొన్న హాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ ఏంజెలినా జోలీ ఇప్పుడు అంతర్యుద్ధంతో రగిలిపోతున్న సిరియా నుంచి ఓ పాపను దత్తత తీసుకోబోతోంది. గత మూడేళ్లలో ఐక్యరాజ్య సమితి అంబాసిడర్గా పలుసార్లు సిరియాను సందర్శించిన ఏంజెలినా.. అక్కడి శరణార్థుల శిబిరాల్లో నెలకొన్న పరిస్థితులను చూసి చలించిపోయారు. ముఖ్యంగా ఆడేపాడే వయస్సులో ఆకలితో అలమటిస్తున్న పిల్లలను చూసి జాలిపడ్డారు. 'బాల్యాన్ని హైజాక్ చేస్తారా' అంటూ టెర్రరిస్టులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అప్పటి నుంచే సిరియా శరణార్థుల శిబిరాల నుంచి ఓ ఆడపిల్లను దత్తత తీసుకోవాలనే ఆలోచన ఏంజెలినా మనసులో నాటుకుపోయిందని, ఇప్పుడు ఓ పాప దత్తత కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారని 'యూఎస్ వీక్లీ' గురువారం ఓ కథనాన్ని ప్రచురించింది.
దత్తత తీసుకున్న ముగ్గురు పిల్లలు, తన కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలతో కలుపుకొని ఆమెకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఆమె ఎప్పటి నుంచో బ్రాడ్ పిట్తో కలసి కాపురం చేస్తున్న ఆమె తన 38వ ఏట గతేడాదే ఆయన్ని పెళ్లి చేసుకున్నారు. ఆరుగురు పిల్లలతో వారు కాలిఫోర్నియాలోని తమ ఇంట్లో ఉంటున్నారు. మడోక్స్ (13 ఏళ్లు), పాక్స్ (11), జహరా (10), శిలోహ్ (8), వివిన్నే (6), నాక్స్ (6). వివిన్నే, నాక్స్లు కవల పిల్లలు. కాంబోడియాలోని నామ్పెన్ నగరం అనాథాశ్రయం నుంచి మడోక్స్ను, వియత్నాంలోని హోచిమన్ నగరం అనాథాశ్రయం నుంచి పాక్స్, ఇథియోపియాలోని అడి అబాబా నగరం అనాథాశ్రయం నుంచి జహరాలను ఏంజెలినా దత్తత తీసుకున్నారు. ఇకముందు పిల్లలు పుట్టే అవకాశం లేకుండా ఆమె ఇటీవలనే అండాశయాన్ని తొలగించుకున్నారు. ఆమె తల్లి, ఇద్దరు సోదరీమణులు అండాశయ క్యాన్సర్తో చనిపోవడంతో, జన్యుపరంగా తనకు కూడా క్యాన్సర్ సోకే అవకాశం ఉండడంతో ముందుజాగ్రత్తగా దాన్ని తొలగించుకున్నారు. క్యాన్సర్ భయంతో ఆమె ఇదివరకే తన బ్రెస్ట్ తొలగించుకున్న విషయం తెలిసిందే.