ఆర్టీఏ కార్యాలయంలో అడ్డగోలు దందా!
సాక్షి ప్రతినిధి, న్యూస్‌లైన్: ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగినా.. పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నా.. అతి వేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకుల వుతున్నా.. ఆర్టీఏ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడరు. కళ్లముందే అదనపు ప్రయాణికులతో పాటు ప్రమాద కరమైన లగేజీని బస్సులో తరలిస్తుంటే రూ.500 తీసుకుని రైట్ చెబుతున్నారు. ఈ శాఖ అవినీతికి పునాది రాయిలా నిలిచిందని జిల్లా వాసులు నెత్తి నోరు బాదుకున్నా.. దాన్ని నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోరు. నెల వస్తే ఎవరి వాటా వారి ఇళ్లకు చేరాల్సిందే. పైసా తగ్గినా సహించరట! కింది స్థాయి సిబ్బందినీ ఉపేక్షించరట! తాజాగా మూడు నెలల పాటు సమైకాంధ్ర ఉద్యమాలు ఉవ్వెత్తున సాగితే ఆర్టీఏ కార్యాలయం సిబ్బంది కూడా అందులో పాల్గొన్నారు.
కాగా తిరిగి విధులకు హాజరైన సిబ్బంది పనిదినాల్లో వచ్చిన అక్రమ సొమ్మును పంచుకుని ఓ ఉన్నతాధికారికి ఆయన వాటా ముట్టజెప్పేందుకు వెళ్లారు. అక్రమ సొమ్మును లెక్కపెట్టుకున్న అధికారి డబ్బును విసిరి కొట్టినట్లు తెలిసింది. ఇదేంది లెక్క తగ్గిందని సిబ్బందిపై హుకుం జారీ చేసినట్లు సమాచారం. కాగా సిబ్బంది రెండు నెలల పాటు ఉద్యమంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. తనకు అదంతా సంబంధం లేదని అధికారి తేల్చి చెప్పారట! ప్రతి నెలా తనకు చెందాల్సిన సొమ్ము పక్కాగా ఇవ్వాల్సిందేనని, లేని పక్షంలో మీ ఇష్టం అని చెప్పడంతో సిబ్బంది వారి వాటాల్లో తగ్గించుకుని మిగిలిన సొత్తు పోగేసి ఇచ్చినట్లు తెలిసింది.
చెక్‌పోస్ట్ నుంచి రూ.2 లక్షలు
పెనుకొండ చెక్‌పోస్ట్ నుంచి రూ.2 లక్షల నగదు ప్రతి నెలా జిల్లా కేంద్రంలోని ఓ ఉన్నతాధికారికి ముట్టజెప్పాల్సిందేనని తెలిసింది. కాగా ఆ డబ్బును వసూలు చేయాలంటే అక్కడి సిబ్బంది వాహనాలు నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్నా.. వదిలి పెట్టాల్సిందే. కాక పోతే వాహనాన్ని బట్టి ధర నిర్ణయిస్తారు.
మాట వినక పోతే వాహనాన్ని సీజ్ చేసి కోర్టుకు హజరు పరుస్తూ వస్తారు. అధికారుల ఒత్తిడితోనే తాజాగా ఓ టూరిస్ట్ బస్సును కూడా రూ.500 లంచంగా తీసుకుని వదిలిపెట్టారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఈ విషయం బహిర్గతం కావడంతో చెక్ పోస్ట్‌కు ఆఫీస్ సబార్డినేటర్లను వేయకుండా వారిని కేవలం కార్యాలయం విధులకు నియమించినట్లు తెలిసింది. చెక్‌పోస్ట్‌లో ప్రెవేట్ వ్యక్తులను నియమించి వారి ద్వారానే డబ్బు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం.
మహాబూబ్‌నగర్ ఘటనతో
కురుస్తున్న ధనం
మహబూబ్‌నగర్ జిల్లా పాల్యం వద్ద ఓల్వో బస్సు ప్రమాదానికి గురై 45 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల అధికారులకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి బస్సులను కట్టడి చేయాలని సూచించింది. దీంతో ఆర్టీఏ అధికారుల జేబుల్లో ధన వర్షం కురుస్తోంది. అర్ధ రాత్రిళ్లు 44వ జాతీయ రహదారిపై వందలాది బస్సులు ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో ఓ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులు ఒకే నెంబరుతో తిరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం తెలిసినా అధికారులు స్పందించడం లేదని కార్యాలయ సిబ్బంది వాపోతున్నారు. ఆర్టీఏ కార్యాలయంలో అవినీతి పర్వానికి తెర వేయాలని సంబంధిత శాఖాధికారులను జిల్లా వాసులు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆర్టీఏ అధికారుల అవినీతి బాగోతాలపై అసలు నిజాలను వెలికి తీసి ప్రజలకు మెరుగైన సేవలందించేలా చూడాలని పలువురు కోరుతున్నారు.