క్యూలెక్స్ దోమషికార్
విజృంభిస్తున్న ఫైలేరియా
డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడమే కారణం
వర్షాకాలంలో పొంచి ఉన్న ప్రమాదం
జాబితాలో కశింకోట, సత్యవరం, అనకాపల్లి
అనకాపల్లి పట్టణంలో 364 మంది వ్యాధిగ్రస్తులు
వర్షాకాలం మొదలైతే వైద్య, ఆరోగ్య శాఖకు దడ మొదలైనట్టే. ఈసారి ఈ దడకు కారణం ఫైలేరియా. వ్యాధి కారకాలు శరీరంలోకి ప్రవేశించినప్పటికీ ఐదేళ్ల వరకూ తెలుసుకోలేని వ్యాధి ఫైలేరియా. ఇపుడు అనకాపల్లిపై పడగ వేసింది. కొరుప్రోలు, కశింకోట, సత్యవరం, అనకాపల్లిలో ఎందరో ఫైలేరియా బారిన పడుతున్నారు. ఫైలేరియాను పూర్తి స్థాయిలో నివారించే మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ను ప్రతి ఏడాది నవంబర్ నెలలో నిర్వహిస్తున్నా ఎక్కడో ఒక చోట ఈ వ్యాధి బయటపడుతోంది.
అనకాపల్లి : పాలన పగ్గాలు చేపట్టేముందు వల్లమాలిన హామీలు గుప్పించే స్థానిక సంస్థల పాలకుల పారిశుద్ధ్య మెరుగుదలపై ప్రద ర్శిస్తున్న నిర్లక్ష్యం పలువురికి శాపంగా మారుతోంది. ఫైలేరియాపై అధికారుల లెక్కల ప్రకారం కొరుప్రోలులో కొత్త కేసులు బయటపడుతున్నాయి. గత ఏడాది నవంబర్ నెలలో చేపట్టిన సర్వేలో అక్కడ నాలుగు కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాది మార్చి నెలలో అనకాపల్లిలో ఒక ఫైలేరియా కేసు వెలుగులోకి వచ్చింది. తదుపరి స్థానాల్లో కశింకోట, సత్యవరం, యారాడ ఉన్నాయి.
విఫలమౌతున్న డ్రైనేజీ వ్యవస్థ
జిల్లాలో చాలా చోట్ల డ్రైనేజీ వ్యవస్థ విఫలమవుతోంది. కొన్ని చోట్ల పూడిక తీసి, కాస్తో కూస్తో బ్లీచింగ్, ఫినాయిల్ చల్లించి స్థానిక సంస్థల అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరపకపోవడానికి కారణం బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్ల కొనుగోలుకు నిధుల కొరత అని చెప్పి తప్పించుకుంటున్నారు. పారిశుద్ధ్య కార్మికుల సిబ్బంది కొరత అని ఆ విభాగం చెబుతుండగా, చాలా చోట్ల పూడికపోయిన కాలువలు, ఆక్రమణలతో కుచించుపోయి డ్రైనేజీ సిస్టం విఫలమయ్యింది. దీనికి గాను సంబంధిత ఇంజినీరింగ్ విభాగానిదే తప్పని పక్క శాఖ చెబుతోంది.
నీటి నిల్వ ప్రమాదకరం...
చాలా చోట్ల మురుగునీరు నిల్వ అత్యంత ప్రమాదకరంగా మారింది. మురుగు నీరు నిల్వ ఉండిపోవడంతో దోమలు, ఈగలకు ఆవాసాలుగా మారాయి. ఈ తరహా డ్రైనేజీ సిస్టం బాగా లేని ప్రాంతాలైన కొరుప్రోలు, అనకాపల్లి, కశింకోటలలో క్యూలెక్స్ దోమ విజృంభణ అధికంగా ఉంటుందని ఈ కారణంగానే ఫైలేరియా ఛాయాలు ఆయా ప్రాంతాల్లో అధికంగా కనిపిస్తున్నాయని సంబంధిత శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు.
అనకాపల్లి పట్టణంలో 364 కేసులు.. : అనకాపల్లి డ్రైనేజీ సిస్టం పూర్తిగా విఫలమైంది. చాలా చోట్ల సాగు, మురుగు కాల్వల అనుసంధాన పనులను స్తంభించాయి. ప్లాస్టిక్,చెత్త వంటి వ్యర్థాలతో కాలువలు పూడికపోయి దోమలకు, ఈగలకు ఆవాసాలుగా మారాయి. ఈ కారణంగానే 364 ఫైలేరియా కేసులు ప్రస్తుతం ఉన్నాయి. వీరంతా ఫైలేరియా విజృంభించకుండా మందులు వేసుకుంటున్నారు.
ఐదేళ్ల వరకూ తెలియని ఫైలేరియా... : క్యూలెక్స్ దోమ కాటుతో ఫైలేరియా వ్యాధి శరీరంలోకి చొచ్చుకుపోయినప్పటికీ ఐదేళ్ల వరకూ కనిపించదు. గగ్గ దిగడం, హైఫీవర్, కాళ్లు గట్టిగా అవ్వడం వంటి లక్షణాలు కలిగినట్టయితే ఫైలే రియా నివారణ విభాగాన్ని సంప్రదించాలని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి తాకిడి జరిగిన తొలినాళ్లలో వైద్యం తీసుకుంటే నయం అయ్యే అవకాశాలు ఉన్నాయని అనకాపల్లి యూనిట్ ఫైలేరియా నివారణ విభాగ సూపర్ వైజర్ ఎల్.ఎల్ ప్రసాద్ చెబుతున్నారు.