ఆకుట్టుకున్నాడు..
గాన గంధర్వుడు ఎస్పీ బాలు గళం.. నటుల గళాన్ని అనుసరిస్తూ సాగుతుంది. సెలబ్రిటీ టైలర్‌గా పేరొందిన మురళి కూడా అంతే.. మనుషుల రూపురేఖల్ని బట్టి అందంగా ఆహార్యాన్ని రూపుదిద్దుతాడు. ఒక్కసారి టైలర్ గారి పనితనం చూపిన డ్రెస్ వేసుకుంటే.. సదరు వ్యక్తికి అదే అ‘డ్రెస్’గా సెట్ అయిపోతుంది.
అబిడ్స్.. రద్దీగా కనిపించే ఈ ప్రాంతంలో.. ఎన్నో డిజైనర్ షోరూమ్‌లు అద్దాల మేడల్లో మెరిసిపోతుంటాయి. ఇక్కడి మయూర్ కుశాల్ కాంప్లెక్స్ తొలి అంతస్తులోని బి-బ్లాక్‌లో ఉంటుందీ టైలర్ కొట్టు. మెడలో ఓ టేప్ వేసుకుని.. సాదాసీదాగా కనిపించే మురళి.. కొలతలు తీసుకున్నాడా..! మీరు నిశ్చింతగా ఉండొచ్చు. మీ బాడీకి కరెక్ట్‌గా సెట్ అయ్యే విధంగా డ్రెస్ కుట్టిపెడతాడాయన. ఈయన పనితనం ఒక్కసారి చూస్తే.. ఎవరూ ఆయనను వదిలిపెట్టరు. అంత అందంగా ఒంటిపై ఒదిగిపోతాయి ఈయన కుట్టిన డ్రెస్‌లు.
ఈయన లిస్ట్‌లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా ఉన్నారు. 15 ఏళ్లపాటు వెంకయ్యనాయుడు ఈయన కుట్టిన చొక్కాల్లోనే తళుక్కుమన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రంగారెడ్డి, ఒకప్పటి డీజీపీ సుకుమార్, చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ నర్సింహారెడ్డి (రిటైర్డ్), ఇంకా పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, పారిశ్రామికవేత్తలు, మార్వాడీ, అగర్వాల్ ప్రముఖులు కూడా మురళి కుట్టిన జోతలకు జేజేలు పలికిన వారిలో ఉన్నారు. ఆయన కుట్టుబాటుతనం అలాంటిది మరి. ఈయనకు జంట రాష్ట్రాల నుంచే కాదు.. విదేశీ కస్టమర్లు కూడా ఉన్నారంటే దర్జీగా ఆయన దర్జా ఏంటో తెలుస్తుకోవచ్చు. ఓ సినిమాలో నాగార్జున కాస్ట్యూమ్స్ ఈయనే రూపొందించాడు. అలాగే డెలాయిట్ కంపెనీ ఉద్యోగులకు కొన్నాళ్ల పాటు ఈయనే డ్రెస్‌లను కుట్టి పెట్టారు.
రేమాండ్ అడ్డాగా..
మెదక్ జిల్లా జిన్నారానికి చెందిన మురళీధర్ చిన్నప్పటి నుంచే కుట్టు మిషన్‌పై కదం తొక్కేవాడు. 1990లో అబిడ్స్‌లోని సుమంగళ్ రేమాండ్ షోరూమ్‌లో టైలరింగ్ విభాగంలో హెడ్‌గా తన ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 2010లో ఆ షాప్ మూతపడటంతో తనే సొంతంగా టైలర్ షాప్ ప్రారంభించాడు. రేమండ్కు అనుబంధంగా 20 ఏళ్లపాటు పనిచేయడంతో.. ఆ షోరూమ్‌కు వచ్చే ప్రముఖులందరూ మురళీ కస్టమర్లుగా మారిపోయారు. ఆయన పనితనం తెలిసిన వారు మాత్రం.. ఇప్పటికీ ఆయన షాపును
వెతుక్కుంటూ వస్తున్నారు.