కుక్క బిర్యాని మెసేజ్ పెట్టింది ఇతనే..
హైదరాబాద్: కుక్క మాంసంతో బిర్యాని తయారు చేస్తున్నారని ఫేక్ న్యూస్ ను వాట్సాప్ లో పెట్టిన యువకుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెస్టారెంట్ కు వెళ్తున్న స్నేహితులను భయపెట్టేందుకు ఎంబీఏ విద్యార్థి వలబోజు చంద్రమోహన్.. తల నరికిన కుక్కల ఫోటోలతో పాటు షా గౌస్ హోటల్ యజమానిని పోలీసులు అరెస్టు కూడా చేశారని ఫేక్ న్యూస్ ను వారికి ఫార్వాడ్ చేశాడు.
దీంతో షాక్ కు గురైన చంద్రమోహన్ స్నేహితులు తమకు వచ్చిన వివరాలను వేరే వాట్సాప్ గ్రూప్ లకు ఫార్వాడ్ చేసినట్లు పోలీసులు చెప్పారు. వాట్సాప్ గ్రూప్ లను పరిశీలించుకుంటూ వెళ్లగా చంద్రమోహన్ ఫేక్ న్యూస్ ను పంపినట్లు గుర్తించామని వెల్లడించారు. కాగా, షా గౌస్ హోటల్ యజమానిని కుక్క మాంసం బిర్యానీ కేసులో పోలీసులు అరెస్టు చేశారనే వాట్సాప్ మెసేజ్ ను అన్ని ప్రముఖ న్యూస్ చానెళ్లు ప్రసారం చేశాయి. దీంతో నగరమంతటా ఒక్కసారిగా కలకలం రేగింది. జీహెచ్ఎంసీ హెల్త్ అధికారులు షా గౌస్ హోటల్ పై రైడ్ నిర్వహించారు.
ఫేక్ న్యూస్ కారణంగా తమ హోటల్ పరువుపోయిందని యజమాని మహమ్మద్ రబ్బానీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి విచారణ జరిపి చంద్రమోహన్ ను అరెస్టు చేశారు.