జైలుకెళ్లి వచ్చినా బుద్ధిమారలేదు..
శంషాబాద్: చెడు తిరుగుళ్లకు అలవాటు పడి దొంగతనాలనే వృత్తిగా ఎంచుకున్నాడు. ఒకసారి జైలు ఊచలు లెక్కబెట్టి వచ్చినా అతడి బుద్ధి మారలేదు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన షేక్ సమీర్ హుస్సేన్ ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవాడు. సరదాలు తీర్చుకోవటానికి ఇతడు బోధన్‌లో 50 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసి, విక్రయించాడు. తాళం వేసి ఉన్న ఇళ్లే ఇతడి లక్ష్యం. అందులోనూ తాళం బలహీనంగా ఉన్న వాటిని మాత్రమే ఇతను ఎంచుకుంటాడు. ఈ రకమైన చోరీల్లో సమీర్ సిద్దహస్తుడుగా మారాడు. ఆయా కేసుల్లో జైలుకు కూడా వెళ్లివచ్చాడు. అయితే, తన బుద్ధి మాత్రం మార్చుకోలేదు.
ప్రస్తుతం ఇతడు రాజేంద్రనగర్ మండలం బండ్లగూడ జాగీర్‌లో తన సోదరుడితో కలిసి నివాసముంటున్నాడు. గత రెండుమూడు నెలల్లోనే రాజేంద్రనగర్, నార్సింగి పరిధిలో మొత్తం పదిచోట్ల ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలతోపాటు ల్యాప్‌టాప్‌లు, ఎల్ఈడీ టీవీలు ఎత్తుకుపోయాడు. చోరీ సొత్తును బోధన్, ముంబయిలలో విక్రయించి ఆ సొమ్ముతో జల్సా చేసేవాడు. ఇప్పటి వరకు సమీర్ 40 తులాల బంగారం, కిలోన్నర వెండి, మూడు ల్యాప్‌టాప్‌లు, ఎల్ఈడీ టీవీ ఒకటి, రెండు డిజిటల్ కెమెరాలు చోరీ చేశాడు. రెండురోజుల కిందట వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు సమీర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. అతడిచ్చిన సమాచారం మేరకు బంగారం 35 తులాలతో పాటు మిగతా వస్తువులన్నీంటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ పది లక్షల వరకు ఉంటుందని తెలిపారు. నిందితుడుని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.