లవ్ కిచిడి
నువ్వు-నేను - శైలేష్ నారాయణ్, సూర్య అగర్వాల్
YOU AND I
"I believe that marriage is not between a man and woman... but between love and love' అంటాడు ఫ్రాంక్ ఓషన్. ‘సోషల్ కిచిడి’ అనే మార్కెటింగ్ సంస్థను నడిపిస్తున్న .. శైలేష్ నారాయణ్, సూర్య అగర్వాల్‌ల పెళ్లి కూడా అలాంటిది. రెండు ప్రేమలు సహజీవనం చేస్తే ఎలా ఉంటుందో మూడేళ్ల వీళ్ల వైవాహిక జీవితమూ అలాగే ఉంటుంది!
శైలేష్‌ది ఉద్యోగ కుటుంబం.. సూర్య వాళ్లది వ్యాపార కుటుంబం. శైలేష్ ఎంబీఏ చేస్తే.. ఆమె మాస్ కమ్యూనికేషన్ చదివింది. ఆయన పక్కా హైదరాబాదీ. సూర్య.. లక్నో వాసి. తొలుత ఆమె జర్నలిస్ట్ హిందుస్థాన్ టైమ్స్‌లో. శైలేష్ అడ్వర్టయిజింగ్ ఫీల్డ్‌లో ఉన్నాడు. ప్రేమ వివాహం.
కలిసింది ఎక్కడ?
ఉన్నత చదువుల కోసం ఇద్దరూ యూకే వెళ్లారు. ఒకటే యూనివర్సిటీ. అక్కడ ఇద్దరికీ పరిచయం. అది కాస్తా ప్రణయంగా.. ఆపై పరిణయంగా మారింది. ఆ వివరాలను చెప్తూ శైలేష్ ‘యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఒకరంటే ఒకరికి అభిమానం. కలిసి జీవిస్తే బాగుంటుందనుకున్నాం. పీజీ అయిపోయాక తను లక్నో వెళ్లిపోయింది. నేను హైదరాబాద్ వచ్చేశాను. అప్పుడే మా ఇద్దరికీ ఓ పొలిటికల్ ప్రాజెక్ట్‌లో పని చేసే అవకాశం వచ్చింది. అదీ లక్నోలో’ అని ఆపాడు. ‘ఆ టైమ్‌లో మా ఇద్దరి మధ్య మరింత అండర్స్టాండింగ్ పెరిగింది. తర్వాత పెళ్లితో ఒకటయ్యాం’ పూర్తిచేసింది సూర్య.
భేదాలే అద్భుతాలు సృష్టిస్తాయి..
వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఇద్దరివీ ఒకే రకమైన అభిరుచులైనా.. వృత్తిపరంగా బోలెడు వ్యత్యాసం ఉంది. ‘ఆ డిఫరెన్సే మా నుంచి బెస్ట్ ఔట్‌పుట్‌ని రాబడుతోంది. తను చక్కగా ఆర్గనైజ్ చేస్తుంది. అడ్మిన్‌స్ట్రేషన్ స్కిల్స్ బాగా ఉన్నాయి’ అని భార్యకు కితాబిస్తూనే ‘కాని బయట మార్కెట్ ఎలా ఉన్నదన్న విషయాన్ని గమనించదు’అంటూ సూర్య చూడని యాంగిల్‌నూ చెప్తాడు. ‘నిజమే. శైలేష్ మార్కెటింగ్ స్కిల్స్ సూపర్బ్. నేను ఒకటే యాంగిల్లో ఆలోచిస్తుంటే ఆ అంశానికున్న మిగిలిన డెమైన్షన్స్నూ చూపిస్తాడు. కాబట్టే ‘సోషల్ కిచిడీ’ బ్రహ్మాండంగా రన్ అవుతోంది’ సూర్య.
అభిప్రాయభేదాలు తారస్థాయికి చేరవా?
‘ఎందుకు చేరవు. ఒక్కోసారి చాలా సీరియస్‌గా ఉంటాయి’ అని అతను చెప్తుంటే ‘అయితే అవి డిస్కషన్స్గానే ఉంటాయి తప్ప ఆర్గ్యుమెంట్స్‌గా మారవు. చర్చించి ఇద్దరికీ కాస్త దగ్గరగా ఉన్న ఒక పాయింట్ కన్విన్స్ అయిపోతాం. ఆ కామన్ పాయింట్‌నే ఫోకస్ చేస్తాం. బ్రహ్మాండమైన రిజల్ట్స్నిస్తుంది. ఒకే అభిప్రాయంతో ఉంటే ఇలాంటి అద్భుతాలు రావేమో!’ అంది సూర్య. ‘అసలామాటకొస్తే భార్యాభర్తలైన మేమిద్దరం పార్ట్‌నర్స్‌గా ఉండడమే సోషల్ కిచిడీ సక్సెస్. మా ఇద్దరి మధ్య వచ్చిన బిజినెస్ డిఫరెన్సెస్ బయటి బిజినెస్ పార్ట్నర్తో వచ్చుంటే ఇది క్లోజ్ అయిపోయేదేమో’ అన్నాడు శైలేష్. ‘ఈ లెక్కన మా మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉన్నట్టే!’ అంది సూర్య నవ్వుతూ.
బలము.. బలహీనత
‘అలా కచ్చితంగా పరిశీలించుకోలేదు మేం. పరిస్థితులకనుగుణంగా ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవించుకుంటాం. దానికి తగ్గ సర్దుబాటు ఉంటుంది’ అంటారు సూర్య. ‘మేమిద్దరం వేరనే భావన ఉండదు. ఒకరు ఒక విషయంలో వీక్ ఉంటే ఆటోమేటిగ్గా అవతలివాళ్లు దాన్ని స్ట్రెంతెన్ చేసేస్తారు. ఏ ప్రతికూల పరిస్థితినైనా మాకు అనుకూలంగా మలచుకునే శక్తి మా ఇద్దరికీ ఉంది’ అంటాడు శైలేష్. ‘కాకపోతే కోపం లాంటి ఎమోషన్స్ నాకే ఎక్కువ’ నిజాయితీగా ఒప్పుకుంది సూర్య. ‘ఆ టైంలో నేనూ అరిస్తే ప్రాబ్లం మరింత కాంప్లికేట్ అవుతుంది కదా. అందుకే ఓపికగా ఉంటాను. అయితే తన కోపం పాలమీది పొంగు. చప్పున చల్లారిపోతుంది’ అంటాడు. ‘అవును. అసలు అలిగే చాన్సే ఇవ్వడు. రెండు నిమిషాలకే నవ్విస్తాడు. ఏ విషయం మీద అలగాలనుకున్నానో, కోపం ఎందుకు వచ్చిందో కూడా మరచిపోతా’నని చెప్తుంది ఆమె.
మూడేళ్లలో మొదటి అడుగు చూసుకుంటే..
‘మూడేళ్ల పెళ్లి, అంతకుముందు ఏడాదిన్నర స్నేహం. మొత్తం నాలుగున్నరేళ్లు. డెఫినెట్‌గా లాట్ ఆఫ్ చెంజ్ ఉంది. పెళ్లి భార్యాభర్తలను కాలంతో పరిణతి చెందేలా చేస్తుంది. ఒకరితో ఒకరు సర్దుకుపోయేలా ఇద్దరినీ తీర్చిదిద్దుతుంది’ అని వివాహ వ్యవస్థ గొప్పదనాన్ని చెప్పాడు శైలేష్. ‘మేం పెళ్లి చేసుకునేటప్పుడు లవ్ మ్యారేజ్ ఆర్నెల్లు, అరేంజ్డ్ మ్యారేజ్ ఏడాది సౌఖ్యంగా ఉంటుంది అని కామెంట్ చేశారు. మమ్మల్ని చూసి తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు’ అంటుంది సూర్య. కుటుంబ వారసత్వానికి భిన్నంగా వ్యాపారవేత్తగా నిలదొక్కుకోవాలనేది శైలేష్ ప్రయత్నం. అండగా నిలబడింది ఆమె. రాజకీయవేత్త కావాలనేది ఆమె కోరిక. నెరవేర్చే దిశలో ప్రయాణిస్తున్నాడు శైలేష్. అతడు ఆమె సైన్యం... ఆమె అతడి ధైర్యం! ఇదీ వాళ్ల అనుబంధం!.
- సరస్వతి రమ