Shajahanpur
-
మెడలో విష సర్పంతో అతిచేష్టలు.. నిండు ప్రాణం బలి!
లక్నో: పాములు పట్టేవాడు.. ఏదో ఒకనాడు దాని కాటుకే బలవుతాడంటారు. ఇది నిజమని నిరూపించింది ఇక్కడో ఘటన. ఊరిలో పాములు పట్టి వాటిని కాపాడే యత్నం చేసే ఓ వ్యక్తి.. తన ‘అతి’ చేష్టలతో, నిర్లక్ష్యంతో దాని కాటుకే ప్రాణం పొగొట్టుకున్నాడు. ఉత్తర ప్రదేశ్ షాజహాన్పూర్ జిల్లా పరిధిలోని జైతీపూర్ గ్రామంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. దేవేంద్ర మిశ్రా అనే వ్యక్తి అప్పుడప్పుడు గ్రామంలో, చుట్టుపక్కల ఊళ్లలో ఇళ్లలో దూరిన పాముల్ని పట్టి.. వాటిని ఊరి బయట అడవుల్లో సురక్షితంగా వదిలేస్తుంటాడు. ఈ క్రమంలో తాజాగా రవీంద్ర అనే వ్యక్తి ఇంట్లో కట్లపాము దూరిందన్న సమాచారం అందుకున్నాడు. ఆ విష సర్పాన్ని ఓ కర్ర సాయంతో అతి సులువుగా పట్టుకుని.. దానితో ఊరంతా కలియదిరిగాడు. అక్కడితో ఆగకుండా దానిని ఓ చిన్నారి మెడలో వేసి ప్రదర్శించి.. ఆపై తన మెడలోనూ వేసుకుని ఊరంతా తిరిగాడు. అలా రెండు గంటలు గడిచిన తర్వాత.. పాము తల పట్టుసడలి అతన్ని కాటేసింది. వెంటనే దానిని మళ్లీ బంధించి.. ఓ కుండలో బంధించాడు. అయితే ఆస్పత్రికి వెళ్లకుండా.. ఆకు పసర్లతో గాయానికి చికిత్స చేసుకున్నాడు అతను. ఆపై ఇంటికి చేరుకుని పడుకున్నాడు. పాము మరీ విషపూరితం కావడంతో.. అవేం పని చేయక అతని ప్రాణం పోయింది. అటు కుండ కింద ఉంచిన పాము కూడా చచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. సకాలంలో వైద్యం అంది ఉంటే అతని ప్రాణం దక్కేదని వైద్యులు చెప్తున్నారు. ఇదీ చదవండి: లాడ్జిలో రిమాండ్ ఖైదీ సరసాలు -
పీపీఈ కిట్లో వచ్చినా ఫలితం దక్కలేదు
షాజహాన్పూర్: నగరానికి చెందిన వైద్యరాజ్ కిషన్ సంయుక్త వికాస్ పార్టీ తరఫున షాజహాన్పూర్ నియోజకవర్గానికి ఈనెల 25న నామినేషన్ వేశారు. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? కరోనా వ్యాప్తి నిరోధానికి వాడే పీపీఈ కిట్ తొడుక్కొని, శానిటైజర్ బాటిల్, థర్మల్స్కానర్తో వచ్చి ఆయన నామినేషన్ వేశారు. అయితే ఆయన నామినేషన్ను రిటర్నింగ్ అధికారి ఆదివారం తిరస్కరించారు. దీంతో కుప్పకూలిన వైద్యరాజ్ ఇది అధికారుల కుట్రని విమర్శించారు. మంత్రి సురేశ్ ఖన్నా సూచనల మేరకే అధికారులు తన నామినేషన్ తిరస్కరించారని వాపోయారు. అయితే అసంపూర్ణ డాక్యుమెంట్లు సమర్పించినందునే ఆయన నామినేషన్ తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు. నామినేషన్ రోజే అడిగిన పత్రాలు ఇస్తానన్నా అధికారులు వినిపించుకోలేదని, మరుసటి రోజు వారు కోరిన పేపర్లను సమర్పించానని వైద్యరాజ్ చెప్పారు. కానీ కావాల్సిన పేపర్లను సమర్పించాలని వైద్యరాజ్కు మూడు నోటీసులు ఇచ్చినా స్పందిచలేదని, అందుకే తిరస్కరించామని అధికారులు వివరించారు. ఇంతవరకు వైద్యరాజ్ 18 ఎన్నికల్లో పోటీచేసి దిగ్విజయంగా డిపాజిట్ కూడా దక్కకుండా ఓడిపోయారు. వైద్యరాజ్ ఎవరో తనకు తెలియదని, తానెవరి నామినేషన్ తిరస్కరించమని చెప్పలేదని మంత్రి సురేశ్ వివరణ ఇచ్చారు. యోగిపై పోటీకి కూడా నామినేషన్ వేస్తానని వైద్యరాజ్ గతంలో ప్రకటించారు. -
నాలుగేళ్లుగా వెంటాడుతున్న పాము!
షాజహాన్పూర్: పాము నుంచి తన ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ యువకుడు తంటాలు పడుతున్నాడు. ఇందుకోసం నలుగురు బాడీగార్డులను నియమించుకున్నాడు. యువకుడు ఎక్కడకు వెళ్లినా వారందరూ తుపాకులతో కాపలాగా వెళ్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. షాజహాన్పూర్ జిల్లాకు చెందిన ఓ 24 ఏళ్ల యువకుడు 2013లో ఓ మగ పామును చంపాడట. అప్పటి నుంచి ఆ మగపాముతో జతకట్టిన ఆడ పాము అతన్ని చంపాలని చూస్తోందట. పాముని చంపిన తర్వాత నుంచి ఆడ పాము తనని కిలోమీటర్ల పాటు వెంటపడిందని ఆ యువకుడు చెబుతున్నాడు. ఇప్పటివరకూ నాలుగు సార్లు తనపై పాము దాడికి యత్నించిందని, తనని చంపే దాకా వదిలదని అతను భయంతో వణికిపోతున్నాడు. ఆ పామును చంపిన వారికి రూ.5000/- రివార్డు కూడా ఇస్తానని ప్రకటించాడు. పాము తనని ఏమీ చేయకుండా ఉండేందుకు రక్షణంగా నలుగురు గార్డులను కూడా ఏర్పాటుచేసుకున్నాడు. అతను ఎక్కడుంటే అక్కడ ఆ గార్డులు తుపాకులతో కాపలా కాస్తున్నారు. ఈ విషయంపై జిల్లా అధికారుల స్పందించారు. వర్షాకాలంలో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయని.. వాటిలో ఏదో ఒక దాన్నిచూసి తన వెంటపడిందని యువకుడు భావిస్తున్నాడని అన్నారు. పాము వెంటాడటం అనే మాట అతని భ్రమేనని కొట్టిపారేశారు.