
షాజహాన్‌పూర్: నగరానికి చెందిన వైద్యరాజ్ కిషన్ సంయుక్త వికాస్ పార్టీ తరఫున షాజహాన్‌పూర్ నియోజకవర్గానికి ఈనెల 25న నామినేషన్ వేశారు. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? కరోనా వ్యాప్తి నిరోధానికి వాడే పీపీఈ కిట్ తొడుక్కొని, శానిటైజర్ బాటిల్, థర్మల్‌స్కానర్‌తో వచ్చి ఆయన నామినేషన్ వేశారు. అయితే ఆయన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి ఆదివారం తిరస్కరించారు.
దీంతో కుప్పకూలిన వైద్యరాజ్ ఇది అధికారుల కుట్రని విమర్శించారు. మంత్రి సురేశ్ ఖన్నా సూచనల మేరకే అధికారులు తన నామినేషన్ తిరస్కరించారని వాపోయారు. అయితే అసంపూర్ణ డాక్యుమెంట్లు సమర్పించినందునే ఆయన నామినేషన్ తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు. నామినేషన్ రోజే అడిగిన పత్రాలు ఇస్తానన్నా అధికారులు వినిపించుకోలేదని, మరుసటి రోజు వారు కోరిన పేపర్లను సమర్పించానని వైద్యరాజ్ చెప్పారు.
కానీ కావాల్సిన పేపర్లను సమర్పించాలని వైద్యరాజ్‌కు మూడు నోటీసులు ఇచ్చినా స్పందిచలేదని, అందుకే తిరస్కరించామని అధికారులు వివరించారు. ఇంతవరకు వైద్యరాజ్ 18 ఎన్నికల్లో పోటీచేసి దిగ్విజయంగా డిపాజిట్ కూడా దక్కకుండా ఓడిపోయారు. వైద్యరాజ్ ఎవరో తనకు తెలియదని, తానెవరి నామినేషన్ తిరస్కరించమని చెప్పలేదని మంత్రి సురేశ్ వివరణ ఇచ్చారు. యోగిపై పోటీకి కూడా నామినేషన్ వేస్తానని వైద్యరాజ్ గతంలో ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment