నాలుగేళ్లుగా వెంటాడుతున్న పాము!
షాజహాన్‌పూర్: పాము నుంచి తన ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ యువకుడు తంటాలు పడుతున్నాడు. ఇందుకోసం నలుగురు బాడీగార్డులను నియమించుకున్నాడు. యువకుడు ఎక్కడకు వెళ్లినా వారందరూ తుపాకులతో కాపలాగా వెళ్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. షాజహాన్‌పూర్ జిల్లాకు చెందిన ఓ 24 ఏళ్ల యువకుడు 2013లో ఓ మగ పామును చంపాడట.
అప్పటి నుంచి ఆ మగపాముతో జతకట్టిన ఆడ పాము అతన్ని చంపాలని చూస్తోందట. పాముని చంపిన తర్వాత నుంచి ఆడ పాము తనని కిలోమీటర్ల పాటు వెంటపడిందని ఆ యువకుడు చెబుతున్నాడు. ఇప్పటివరకూ నాలుగు సార్లు తనపై పాము దాడికి యత్నించిందని, తనని చంపే దాకా వదిలదని అతను భయంతో వణికిపోతున్నాడు. ఆ పామును చంపిన వారికి రూ.5000/- రివార్డు కూడా ఇస్తానని ప్రకటించాడు.
పాము తనని ఏమీ చేయకుండా ఉండేందుకు రక్షణంగా నలుగురు గార్డులను కూడా ఏర్పాటుచేసుకున్నాడు. అతను ఎక్కడుంటే అక్కడ ఆ గార్డులు తుపాకులతో కాపలా కాస్తున్నారు. ఈ విషయంపై జిల్లా అధికారుల స్పందించారు. వర్షాకాలంలో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయని.. వాటిలో ఏదో ఒక దాన్నిచూసి తన వెంటపడిందని యువకుడు భావిస్తున్నాడని అన్నారు. పాము వెంటాడటం అనే మాట అతని భ్రమేనని కొట్టిపారేశారు.