భారతదేశంలో కోడిగుడ్లకు విపరీతమైన క్రేజ్
పాము గుడ్లను తినడం అనేది అసాధారణమైన ఘటన
పాము గుడ్డు తింటే పలు అనారోగ్య సమస్యలు ఖాయం
పాము గుడ్లలో విషపూరిత బ్యాక్టీరియా, పరాన్నజీవులు
పాము కోరల వెనుక ఉన్న గ్రంధులలో విషం తయారు
పాము.. ఈ మాట వినగానే చాలామంది భయపడిపోతుంటారు. కొందరు పామును చూస్తే వణికిపోతారు. పాము సంగతి పక్కనుంచి దాని గుడ్లు విషయానికొస్తే పలువురిలో అనేక అనుమానాలున్నాయి. పాము గుడ్లు తినవచ్చా? లేదా అనేదానిపై చర్చలు కూడా సాగుతుంటాయి.
మన దేశంలో కోడి గుడ్లకు విపరీతమైన క్రేజ్ ఉంది. చాలా రకాల ఆహారాలలో గుడ్లను విరివిగా వాడుతుంటారు. అలాగే బాతు, ఉష్ట్రపక్షి గుడ్లను కూడా తింటుంటారు. వీటి గుడ్లను తిన్నప్పుడు మరి పాము గుడ్లు తింటే ఏమవుతుంది? దీనికి మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ నివాసి, స్నేక్ క్యాచర్ మహదేవ్ పటేల్ సమాధానం తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన పాము గుడ్లను మనిషి తినడం అనేది అసాధారణమైన ఘటన అని, ఎవరైనా పాము గుడ్డు తింటే, పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని ఆయన తెలిపారు. పాము గుడ్లలో బ్యాక్టీరియా లేదా పరాన్నజీవులు ఉంటాయని, ఇవి ఫుడ్ పాయిజనింగ్ లేదా ఇన్ఫెక్షన్‌కు కారణమవుతాయని మహదేవ్ పటేల్ వివరించారు.
సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా పాము గుడ్లలో ఉంటుందని, ఇది ఆహారాన్ని కలుషితం చేస్తుందన్నారు. పాము గుడ్లు తినడం వల్ల అలెర్జీ వస్తుందని, ఇది చర్మంపై దద్దుర్లు, దురద, శ్వాస సమస్యలు లేదా అనాఫిలాక్సిస్ లాంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందన్నారు. పాము గుడ్లలో విషం ఉండదని, అందుకే వాటిని తిన్న వ్యక్తి మరణించడని మహదేవ్ తెలిపారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పాముల గుడ్లలో విషం ఉండదు, ఎందుకంటే పాము కోరల వెనుక ఉన్న గ్రంధులలో విషం తయారవుతుంది. ఇది గుడ్డు దశలో ఏర్పడదు. పాము గుడ్లు తినడం వల్ల మనిషి శరీరంలోకి విషం ప్రవేశించే అవకాశాలు చాలా తక్కువ.
భారతదేశంలో పాములను పూజిస్తారు. అందుకే దాని గుడ్లు తినడం అనే ఆలోచన చేయరు. అయితే విదేశాల్లో పాము గుడ్లు తింటుంటారు. అక్కడివారు పాము గుడ్లను తినాలనుకున్నప్పుడు వాటిని బాగా ఉడికిస్తారు. తద్వారా దానిలోని బ్యాక్టీరియా, పరాన్నజీవులు నాశనమవుతాయి. మరోవైపు పాము గుడ్లు తినడం సాధ్యమేనని, వాటిలో పోషక విలువలు ఉంటాయని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. అయితే పాము గుడ్డులోని బ్యాక్టీరియా కారణంగా అనారోగ్యం వచ్చే అవకాశం ఉందని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాగా భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం వన్యప్రాణులకు హాని కలిగించడం శిక్షార్హమైన నేరమని మహదేవ్ పటేల్ తెలిపారు.
ఇది కూడా చదవండి: ‘ఇండియా’కు ఎవరు బెస్ట్? రాహుల్.. మమత బలాబలాలేమిటి?
Comments
Please login to add a commentAdd a comment