ఆధ్యాత్మిక పరవళ్లు
– శ్రీమఠంలో రెండోరోజు ఘనంగా వేడుకలు
– కనువిందు చేసిన శాఖోత్సవం
– అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
మంత్రాలయం:
విరుల తోరణాల పరిమళాలు.. మంగళవాయిద్యాల సుస్వరాలు.. భక్తజన కోలాహలంతో శ్రీరాఘవేంద్రుల క్షేత్రంలో ఆధ్యాత్మికం పరవళ్లు తొక్కింది. రాయరు 345వ సప్తరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం వేడుకలు శాస్త్రోక్తంగా సాగాయి. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు ఆధ్వర్యంలో శాఖోత్సవం, రజత మంటపోత్సవం ప్రత్యేకం. శాఖోత్సవంలో భాగంగా పచ్చి కూరగాయలు, ఫలాలకు విశేష పూజలు చేపట్టి పీఠాధిపతి హారతులు పట్టారు. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలకు పీఠాధిపతి డోలోత్సవ మండపంలో దివిటీ, ఊంజల సేవ భక్తులను ఆకట్టుకుంది. ఉదయం రాఘవేంద్రుల మూలందావనంకు పంచామతాభిషేకం గావించారు. యాగశాలలో యజుర్వేద ఉపాకర్మ యజ్ఞం కానిచ్చారు. బ్రాహ్మణులు జంజముల మార్పిడి చేపట్టారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు:
వేడుకలు పురష్కరించుకుని యోగీంద్ర మండపంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. బెంగళూరుకు చెందిన రాఘవేంద్ర సంగీత కచేరి, బళ్లారికి చెందిన చిన్నారి పల్లవి దేశాయ్ నాట్య ప్రదర్శన ఆకట్టుంది. గీతా సంజీవ్ కులకర్ణి దాసవాణి భక్తి గేయాలు మైమరిపించాయి. వేడుకల్లో ఆప్త కార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ పాల్గొన్నారు.
నేడు పూర్వారాధన :
ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పూర్వారాధన జరగనుంది. మూలబృందావనానికి మహా పంచామృతాభిషేకం, ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయల సింహవాహనోత్సవం నిర్వహిస్తారు. మంత్రాలయం హనుమేష్, బెంగుళూరు ముద్దుమోహన్చే దాసవాణి ఉంటుంది. ముఖ్యంగా మంత్రాలయం సంస్కృత విద్యాపీఠం ఉప కులపతి పంచముఖి, మహోపాధ్యాయ మద్రాసు మీమాంస సంస్కృత కళాశాల ప్రొఫెసర్ మణి ద్రవిడ, బళ్లారికి చెందిన సామాజిక సేవకుడు, బళ్లారి మఠం అభివద్ధి ప్రదాత సూర్యనారాయణరెడ్డికి రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్థి అవార్డుల ప్రదానం పీఠాధిపతి చేతుల మీదుగా గావిస్తారు.