Shakti Mills compound
-
ముంబై 'గ్యాంగ్ రేప్' నిందితులపై మరో కేసు
ఫోటో జర్నలిస్టుపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఐదుగురు నిందితులు సాగించిన మరో అత్యాచార పర్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శక్తి మిల్స్ గ్యాంగ్ రేప్ కేసు నిందితులు తనను కూడా లైంగికంగా వేధించారంటూ మరో మహిళా పోలీసులను ఆశ్రయించింది. ఈ ఏడాది జూలైలో తనపై ఈ అకృత్యానికి పాల్పడ్డారని భన్దప్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. శక్తి మిల్స్ ప్రాంగణంలోనే ఈ దారుణానికి ఒడిగట్టారని తెలిపింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును ఎన్ఎమ్ జోషి మార్గ్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. రేపిస్టులను ఆమె గుర్తించిందని పోలీసులు తెలిపారు. మరోవైపు పోలీసుల ఇంటారాగేషన్లో గ్యాంగ్ నిందితులు మరిన్ని విషయాలు వెల్లడించారు. గత ఆరు నెలల కాలంలో యంగ్ జర్నలిస్టు, సెక్స్ వర్కర్, చెత్త ఏరుకునే కార్మికురాలితో సహా పలువురిపై అత్యాచారానికి ఒడిగట్టినట్టు తెలిపారు. ఆగస్టు 22న ఫోటోజర్నలిస్టుపై సామూహిక అత్యాచారానికి పాల్పడడంతో సలీం అన్సారీ, విజయ్ జాదవ్, మహ్మద్ ఖాసిం, హఫీజ్ షేక్, ఖాసిం బెంగాలీ, సిరాజ్ రెహమాన్ ఖాన్, మైనర్ బాలుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
ఫోటో జర్నలిస్టుపై గ్యాంగ్‌రేప్
సాక్షి, ముంబై: దేశం మొత్తాన్నీ కుదిపేసిన ‘నిర్భయ’పై అత్యాచార ఘటన ఇప్పటికీ ప్రజల మది నుంచి తొలగకముందే.. దేశ ఆర్థిక రాజధాని ముంబై నడిబొడ్డున మరో దారుణం చోటుచేసుకుంది. నాడు నిర్భయ తరఫున జరిగిన పోరాటంలో మీడియా తన వంతు పాత్ర పోషిస్తే.. ఈసారి ఏకంగా మీడియా ప్రతినిధిపైనే సామూహిక అత్యాచారం జరిగింది. ముంబైలో ఓ ఇంగ్లిష్ మేగజైన్‌కు ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తున్న 22 ఏళ్ల యువతిపై ఐదుగురు యువకులు గురువారం సాయంత్రం ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. మహాలక్ష్మి, లోయర్పరెల్ రైల్వేస్టేషన్ల మధ్యలో ఉన్న శక్తిమిల్లు కాంపౌండ్‌లో జరిగిన ఈ సంఘటన ముంబైతోపాటు దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. నిర్భయ ఘటన తర్వాత అత్యాచార కేసులను చాలా సీరియస్‌గా తీసుకుంటున్న పోలీసులు.. నిందితులను పట్టుకోవడానికి ఒకేసారి 20 బృందాలను రంగంలోకి దించారు. అనేక మందిని విచారించిన మీదట ఓ నిందితుడిని పట్టుకోగలిగారు. అతడి ద్వారా మిగతా నిందితుల వివరాలు తెలుసుకున్నారు. కల్పిత కథతో బెదిరించి.. 22 ఏళ్ల మహిళా ఫొటో జర్నలిస్ట్‌ను కల్పిత కథతో బెదిరించి నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ అందించిన వివరాల మేరకు.. తన సహచరునితో విధి నిర్వహణలో భాగంగా గురువారం శక్తి మిల్లు పరిసరాల్లో ఫొటోలు తీసుకునేందుకు ఈ మహిళా జర్నలిస్టు వెళ్లింది. శిథిలావస్థకు చెందిన ప్రాంతం కావడంతో సాధారణంగా అక్కడ ఎవరూ లేరు. దీంతో వీరు తమ పనిలో భాగంగా ఫొటోలు తీసుకుంటుండగా అక్కడకొచ్చిన ఇద్దరు వ్యక్తులు.. ‘మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు’ అంటూ నిలదీశారు. పది రోజుల కిందట ఇక్కడ ఒక హత్య జరిగిందని, అది మీరే చేశారంటూ బెదిరించారు. ఆమె సహచరుడిని చూపిస్తూ.. ఇతనే హంతకుడంటూ మిగతా నిందితులకు ఫోన్ చేసి పిలిచారు. హత్య చేసిన వ్యక్తిలాగానే ఉన్నాడంటూ మిగతా వారు కూడా ఆరోపిస్తూ.. మహిళా ఫొటో జర్నలిస్ట్ సహచరుడిని బెల్ట్‌తో కట్టివేశారు. అనంతరం మిమ్మల్ని వేర్వేరుగా విచారించాలంటూ మహిళా జర్నలిస్ట్‌ను సుమారు 20 అడుగుల దూరం.. సహచరునికి కనబడకుండా తీసుకువెళ్లారు. అక్కడ వంతులవారీగా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన గురువారం సాయంత్రంసుమారు 6.30 గంటల ప్రాంతంలో జరిగింది. గ్యాంగ్ రేప్‌నకు గురవడంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆమెకు మెలకువ వచ్చిన అనంతరం తన సహచరుడి కట్లు విప్పింది. ఇద్దరూ కలిసి 4 కిలోమీటర్ల దూరంలోని జస్లోక్ ఆసుపత్రికి రాత్రి 8 గంటల సమయంలో వచ్చారు. ఆమె రేప్‌కి గురైనట్లు గుర్తించిన వైద్యులు ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు. ప్రస్తుతం బాధితురాలు అక్కడే చికిత్స పొందుతోంది. ఊహాచిత్రాల ఆధారంగా ఒకరి అరెస్టు.. ఈ కేసులో ఊహాచిత్రాల ఆధారంగా ఐదుగురు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసినట్లు ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ చెప్పారు. నిందితుడు తన పేరు చాంద్‌బాబు సత్తార్ షేక్ అలియాస్ మహమ్మద్ అబ్దుల్ (19) అని చెప్పాడన్నారు. ఇతడు నిరుద్యోగి అని, తన సహచరుల పేర్లు విజయ్ జాధవ్, ఖాసిం బెంగాలీ, సలీమ్, అష్ఫాక్ అని చెప్పాడన్నారు. బాధితురాలైన జర్నలిస్టు ముంబై శివారు ప్రాంతానికి చెందినదని తెలిపారు. ‘అత్యాచారానికి గురైన ఫొటో జర్నలిస్ట్ ప్రస్తుతం నగరంలోని జెస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె, ఆమె సహచరుడు చెప్పిన ఆధారాల మేరకు ఊహాచిత్రాలను గీయించి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిందితులందరూ సుమారు 20 నుంచి 22 ఏళ్ల వయసున్నవారే. అయితే కేసు దర్యాప్తు దృష్ట్యా నిందితుల పేర్లను వెల్లడించడంలేదు’ అని సత్యపాల్‌సింగ్ తెలిపారు. నిందితుల్లో ఇద్దరు ఇప్పటికే ఆస్తుల సెటిల్మెంట్ కేసుల్లో రౌడీ షీటర్లుగా ఉన్నారని వివరించారు. స్థిరంగా ఉన్న బాధితురాలి ఆరోగ్యం.. అత్యాచారం సంఘటన కారణంగా ఆమె అవయవాలకు అంతర్గతంగా గాయాలు కావడంతోపాటు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైనట్టు డాక్టర్లు చెప్పారు. జెస్లోక్లో ఆసుపత్రిలో ఆమెకు చికిత్స జరగుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని అయితే పూర్తిగా అన్ని వివరాలు తెలిపేందుకు ఇంకా రెండు మూడు రోజులు పట్టవచ్చని డాక్టర్లు పేర్కొంటున్నారు. నివేదిక కోరిన కేంద్రం గ్యాంగ్‌రేప్ మీద తక్షణమే నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ముంబై పోలీసులను కోరింది. ‘‘ ముంబై పోలీసు కమిషనర్‌తో నేను మాట్లాడాను. దరాప్తు వేగంగా జరుగుతోంది. ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కోరాం’’ అని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే శుక్రవారం ఢిల్లీలో చెప్పారు. నిందితులను వెంటనే పట్టుకుని కఠిన శిక్ష పడేలా చూడాలని కోరామన్నారు. మరోవైపు ఈ కేసులో నిజానిజాలను నిగ్గు తేల్చడానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) ఏకసభ్య విచారణ కమిటీని నియమించింది. పీసీఐ సభ్యుడు రాజీవ్ సబాదే ఈ విచారణ చేపడతారని పీసీఐ చైర్పర్సన్ జస్టిస్ మార్కాండేయ కట్జూ ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘నిందితులందరి వివరాలూ మా దగ్గర ఉన్నాయి. వారందరిపై త్వరలోనే చార్జిషీటు వేసేలా చూస్తాం. కేసుపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేపడతాం. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూస్తాం’’ అని మహారాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ జర్నలిస్టు సంఘాల ప్రతినిధి బృందంతో అన్నారు. 20 బృందాలతో దర్యాప్తు అత్యాచారం సంఘటనకు సంబంధించి 20 బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్టు ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్‌సింగ్ తెలిపారు. వీటిలో 10 క్రైమ్ బ్రాంచి బృందాలు ఉన్నాయని, మిగతావి స్థానిక పోలీసులవని చెప్పారు. బాధితురాలు, ఆమె సహచరుడు అందించిన వివరాల మేరకు గురువారం రాత్రి ఊహచిత్రాలను గీయించామని, వాటి ఆధారంగా దర్యాప్తు ప్రారంభించామని అన్నారు. నిందితులందరినీ త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. బాధితురాలికి న్యాయం చేయడంతోపాటు నిందితులకు కఠిన శిక్ష పడేలా అన్ని ఆధారాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. ఈ కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జరిపించాలని కోరనున్నట్టు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి అన్ని రకాల ఆధారాలను కోర్టుకు సమర్పిస్తామన్నారు. నిందితులపై 341, 376బి, 341 తదితర సెక్షన్లతో కేసు నమోదు చేసినట్టు చెప్పారు. 376బి సెక్షన్ ద్వారా కనీసం 20 ఏళ్లు లేదా జీవిత ఖైదు శిక్ష పడేందుకు అవకాశాలున్నాయన్నారు. -
ముంబై అత్యాచారం: గజానికో గాంధారీ పుత్రుడు
'యత్ర నార్యస్తు పూజ్యంతే.. రమంతే తత్ర దేవతా' అని ఆర్యోక్తి. మహిళలను పూజించేచోటే దేవతలు నివాసం ఉంటారన్నది దాని అర్థం. ఇదే ఆర్యోక్తిని చెప్పిన మన దేశంలో పురాణకాలం నుంచి మాత్రం మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. దాదాపు ఏడాది క్రితం దేశ రాజధానిలో కదులుతున్న బస్సులో 'నిర్భయ'పై సామూహిక అత్యాచారం చేసి, ఆమె స్నేహితుడిని కుళ్లబొడిచి.. ఆమె మరణానికి కారణమయ్యారు ఆరుగురు మృగాళ్లు. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. తత్ఫలితంగా అత్యాచారానికి పాల్పడి.. ఆ నేరం మరింత తీవ్రమైనదైతే ఉరిశిక్ష వరకు విధించేలా 'నిర్భయ' చట్టాన్ని సైతం రూపొందించారు. ఈ కేసులో కీలక నిందితుడు రామ్ సింగ్ అనుమానాస్పద పరిస్థితుల్లో జైల్లోనే మరణించగా, మరో ఐదుగురికి ఇంకా శిక్ష ఖరారు కూడా కాలేదు. ఈ మధ్య కాలంలో కూడా ఎన్నో అత్యాచార సంఘటనలు వెలుగుచూశాయి. ఇప్పుడు తాజాగా మళ్లీ ముంబైలో ఓ పత్రికా ఫొటోగ్రాఫర్‌పై ఐదుగురు మగాళ్లు తమ ప్రతాపం చూపించారు. విధి నిర్వహణలో భాగంగా ఆమె 'శక్తి మిల్స్' అనే ప్రాంతంలో కొనసాగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, డ్రగ్స్ సేవనం లాంటి వ్యవహారాలను ఫొటో తీయడానికి ప్రాణాలకు సైతం తెగించి వెళ్లింది. కానీ అక్కడ ఆమె మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అప్పటికే డ్రగ్స్ మత్తులో కొట్టుకుంటున్న ఐదుగురు మగాళ్లు అచ్చం ఢిల్లీ నిర్భయ కేసులో లాగే... ఆమెతో పాటు ఉన్న అసిస్టెంట్‌ను తాళ్లతో్ కట్టేసి, కొట్టి.. మరీ ఆమెను చెరిచారు. భారతదేశం పర్యాటకులకు, సాహసికులకు స్వర్గధామమే గానీ, మహిళలకు మాత్రం అక్కడ ఇసుమంత కూడా రక్షణ లేదంటూ అమెరికాలోని చికాగో యూనివర్సిటీ నుంచి దక్షిణాసియా వ్యవహారాలపై పరిశోధన కోసం మన దేశానికి వచ్చిన మైఖేలా క్రాస్ అనే అమెరికన్ అమ్మాయి చెప్పిన విషయాలు అక్షర సత్యాలని రుజువైంది. అడుగడుగునా లైంగిక వేధింపులు, ఎక్కడ పడితే అక్కడ తడమడం లాంటి దారుణాలు అక్కడ ఉన్నాయని ఆమె వాపోయింది. రెండు రోజుల వ్యవధిలో ఏకంగా మూడుసార్లు ఆమెపై అత్యాచారం చేసేందుకు కొంతమంది ప్రయత్నించడం ఇక్కడి మహిళల భద్రత పరిస్థితికి పరాకాష్ఠ. తన పరిశోధనలో భాగంగా మహారాష్ట్రకు రెండో రాజధాని లాంటి పుణె నగరానికి వెళ్లిన ఆమెకు అత్యంత చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అక్కడి బజారులో ఉన్న అందమైన చీరలు చాలా తక్కువ ధరకే దొరికినా, అక్కడి మగాళ్లు తమనే చూస్తూ నిలుచున్నారని, తమను కావాలని తోసేస్తూ.. చేతులతో చెప్పరాని చోట్లల్లా నొక్కారని క్రాస్ వాపోయింది. భారతదేశంలో ఆడాళ్లు ఎలా బతుకుతున్నారోనంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. దీని గురించి ఆమె సీఎన్ఎన్ ఐరిపోర్ట్లో రాసిన కథనాన్ని కేవలం రెండు మూడు రోజుల్లోనే దాదాపు ఎనిమిది లక్షల మందికి పైగా చదివారు. ముంబై ఫొటోగ్రాఫర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగుల ఊహా చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. ఆమెతో పాటు ఉన్న అసిస్టెంట్ చెప్పిన వివరాల ఆధారంగా వీటిని రూపొందించారు. అయితే, వీటివల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో, నిందితులను అసలు పట్టుకునే అవకాశం ఉంటుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. అండర్ వరల్డ్ కార్యకలాపాలకు అడ్డాగా ఉన్న ముంబై మహానగరంలో శక్తి మిల్స్ లాంటి ప్రాంతాలు కోకొల్లలు. ఇప్పుడంటే ఓ సంఘటన జరిగి, దాని వివరాలు బయటకు వచ్చాయి గానీ... ఇంతవరకు అలాంటిచోట్ల జరిగిన మిగిలిన సంఘటనలు ఇంకెన్ని వెలుగుచూడకుండా మిగిలిపోయాయో! సాక్షాత్తు దేశ ఆర్థిక రాజధానిలోనే ఇలాంటి పరిస్థితి ఉందంటే, ఇక బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల గురించి ఇక చెప్పుకోనక్కర్లేదు. నిర్భయ లాంటి కఠినమైన చట్టాలున్నా, అవి నేరస్థులకు, కలవారికి చుట్టాలుగానే మిగిలిపోతున్నాయి తప్ప.. దోషులను శిక్షించడానికి ఉపయోగపడట్లేదు. ఈ పరిస్థితి ఇంకెన్నటికి మారుతుందో, నారీమణులను నిజంగా ఎప్పటికి పూజిస్తారో మరి!! -
ఫోటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం
దేశ రాజధానిలో సామూహిక అత్యాచారానికి గురైన నిర్భయ ఘటన దేశ ప్రజల మనోఫలకంపై నుంచి ఇంకా చెరిగిపోక మునిపే దేశ వాణిజ్య రాజధాని మంబైలో మరో మహిళపై సామూహిక అత్యాచార సంఘటన దేశ ప్రజలను తీవ్రంగా కలచివేసింది. ముంబైలోని మహాలక్ష్మీ ప్రాంతంలోని శక్తి మిల్స్ ప్రాంగణంలో ఓ మహిళా (23) ఫోటో జర్నలిస్ట్ పై దుండగులు గురువారం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ ఇంగ్లీష్ పత్రికలో ఫోటో జర్నలిస్టుగా పని చేస్తున్న ఆమె విధి నిర్వహణలో భాగంగా తన అసిస్టెంట్‌తో కలసి గురువారం సాయంత్రం శక్తి మీల్స్ ప్రాంగణంలోకి చేరుకున్నారు. కాగా ఆ మీల్ ప్రాంగణమంతా చాలావరకూ మాదకద్రవ్యాలకు బానిసలైనవారితో కిక్కిరిసి ఉంటుంది. ఆమె ఆ ప్రాంగణంలో ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నించింది. ఆమె ప్రయత్నాన్ని కొంత మంది యువకులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో ఆమె సహాయకునిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం మహిళ ఫోటోగ్రాఫర్పై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమె తన అసిస్టెంట్ సహాయంతో జస్లోక్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి వైద్యులు వెంటనే ఈ ఘటనపై ఎన్ఎం జోషి మార్గ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని సంఘటన వివరాలను తెలసుకుని, 20 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహారాష్ట హోం మంత్రి ఆర్ ఆర్ పాటిల్ మహిళపై అత్యాచర ఘటన విషయం తెలిసిన వెంటనే జస్లోక్ ఆసుపత్రికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిణిస్తుందని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆర్ ఆర్ పాటిల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.