గ్యాంగ్ రేప్ నిందితుల ఊహా చిత్రాలు
సాక్షి, ముంబై: దేశం మొత్తాన్నీ కుదిపేసిన ‘నిర్భయ’పై అత్యాచార ఘటన ఇప్పటికీ ప్రజల మది నుంచి తొలగకముందే.. దేశ ఆర్థిక రాజధాని ముంబై నడిబొడ్డున మరో దారుణం చోటుచేసుకుంది. నాడు నిర్భయ తరఫున జరిగిన పోరాటంలో మీడియా తన వంతు పాత్ర పోషిస్తే.. ఈసారి ఏకంగా మీడియా ప్రతినిధిపైనే సామూహిక అత్యాచారం జరిగింది.
ముంబైలో ఓ ఇంగ్లిష్ మేగజైన్‌కు ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తున్న 22 ఏళ్ల యువతిపై ఐదుగురు యువకులు గురువారం సాయంత్రం ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. మహాలక్ష్మి, లోయర్పరెల్ రైల్వేస్టేషన్ల మధ్యలో ఉన్న శక్తిమిల్లు కాంపౌండ్‌లో జరిగిన ఈ సంఘటన ముంబైతోపాటు దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. నిర్భయ ఘటన తర్వాత అత్యాచార కేసులను చాలా సీరియస్‌గా తీసుకుంటున్న పోలీసులు.. నిందితులను పట్టుకోవడానికి ఒకేసారి 20 బృందాలను రంగంలోకి దించారు. అనేక మందిని విచారించిన మీదట ఓ నిందితుడిని పట్టుకోగలిగారు. అతడి ద్వారా మిగతా నిందితుల వివరాలు తెలుసుకున్నారు.
కల్పిత కథతో బెదిరించి..
22 ఏళ్ల మహిళా ఫొటో జర్నలిస్ట్‌ను కల్పిత కథతో బెదిరించి నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ అందించిన వివరాల మేరకు.. తన సహచరునితో విధి నిర్వహణలో భాగంగా గురువారం శక్తి మిల్లు పరిసరాల్లో ఫొటోలు తీసుకునేందుకు ఈ మహిళా జర్నలిస్టు వెళ్లింది. శిథిలావస్థకు చెందిన ప్రాంతం కావడంతో సాధారణంగా అక్కడ ఎవరూ లేరు. దీంతో వీరు తమ పనిలో భాగంగా ఫొటోలు తీసుకుంటుండగా అక్కడకొచ్చిన ఇద్దరు వ్యక్తులు.. ‘మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు’ అంటూ నిలదీశారు. పది రోజుల కిందట ఇక్కడ ఒక హత్య జరిగిందని, అది మీరే చేశారంటూ బెదిరించారు. ఆమె సహచరుడిని చూపిస్తూ.. ఇతనే హంతకుడంటూ మిగతా నిందితులకు ఫోన్ చేసి పిలిచారు. హత్య చేసిన వ్యక్తిలాగానే ఉన్నాడంటూ మిగతా వారు కూడా ఆరోపిస్తూ.. మహిళా ఫొటో జర్నలిస్ట్ సహచరుడిని బెల్ట్‌తో కట్టివేశారు.
అనంతరం మిమ్మల్ని వేర్వేరుగా విచారించాలంటూ మహిళా జర్నలిస్ట్‌ను సుమారు 20 అడుగుల దూరం.. సహచరునికి కనబడకుండా తీసుకువెళ్లారు. అక్కడ వంతులవారీగా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన గురువారం సాయంత్రంసుమారు 6.30 గంటల ప్రాంతంలో జరిగింది. గ్యాంగ్ రేప్‌నకు గురవడంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆమెకు మెలకువ వచ్చిన అనంతరం తన సహచరుడి కట్లు విప్పింది. ఇద్దరూ కలిసి 4 కిలోమీటర్ల దూరంలోని జస్లోక్ ఆసుపత్రికి రాత్రి 8 గంటల సమయంలో వచ్చారు. ఆమె రేప్‌కి గురైనట్లు గుర్తించిన వైద్యులు ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారు. ప్రస్తుతం బాధితురాలు అక్కడే చికిత్స పొందుతోంది.
ఊహాచిత్రాల ఆధారంగా ఒకరి అరెస్టు..
ఈ కేసులో ఊహాచిత్రాల ఆధారంగా ఐదుగురు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసినట్లు ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ చెప్పారు. నిందితుడు తన పేరు చాంద్‌బాబు సత్తార్ షేక్ అలియాస్ మహమ్మద్ అబ్దుల్ (19) అని చెప్పాడన్నారు. ఇతడు నిరుద్యోగి అని, తన సహచరుల పేర్లు విజయ్ జాధవ్, ఖాసిం బెంగాలీ, సలీమ్, అష్ఫాక్ అని చెప్పాడన్నారు. బాధితురాలైన జర్నలిస్టు ముంబై శివారు ప్రాంతానికి చెందినదని తెలిపారు. ‘అత్యాచారానికి గురైన ఫొటో జర్నలిస్ట్ ప్రస్తుతం నగరంలోని జెస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె, ఆమె సహచరుడు చెప్పిన ఆధారాల మేరకు ఊహాచిత్రాలను గీయించి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిందితులందరూ సుమారు 20 నుంచి 22 ఏళ్ల వయసున్నవారే. అయితే కేసు దర్యాప్తు దృష్ట్యా నిందితుల పేర్లను వెల్లడించడంలేదు’ అని సత్యపాల్‌సింగ్ తెలిపారు. నిందితుల్లో ఇద్దరు ఇప్పటికే ఆస్తుల సెటిల్మెంట్ కేసుల్లో రౌడీ షీటర్లుగా ఉన్నారని వివరించారు.
స్థిరంగా ఉన్న బాధితురాలి ఆరోగ్యం..
అత్యాచారం సంఘటన కారణంగా ఆమె అవయవాలకు అంతర్గతంగా గాయాలు కావడంతోపాటు మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైనట్టు డాక్టర్లు చెప్పారు. జెస్లోక్లో ఆసుపత్రిలో ఆమెకు చికిత్స జరగుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని అయితే పూర్తిగా అన్ని వివరాలు తెలిపేందుకు ఇంకా రెండు మూడు రోజులు పట్టవచ్చని డాక్టర్లు పేర్కొంటున్నారు.
నివేదిక కోరిన కేంద్రం
గ్యాంగ్‌రేప్ మీద తక్షణమే నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ముంబై పోలీసులను కోరింది. ‘‘ ముంబై పోలీసు కమిషనర్‌తో నేను మాట్లాడాను. దరాప్తు వేగంగా జరుగుతోంది. ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కోరాం’’ అని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే శుక్రవారం ఢిల్లీలో చెప్పారు. నిందితులను వెంటనే పట్టుకుని కఠిన శిక్ష పడేలా చూడాలని కోరామన్నారు. మరోవైపు ఈ కేసులో నిజానిజాలను నిగ్గు తేల్చడానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) ఏకసభ్య విచారణ కమిటీని నియమించింది. పీసీఐ సభ్యుడు రాజీవ్ సబాదే ఈ విచారణ చేపడతారని పీసీఐ చైర్పర్సన్ జస్టిస్ మార్కాండేయ కట్జూ ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘నిందితులందరి వివరాలూ మా దగ్గర ఉన్నాయి. వారందరిపై త్వరలోనే చార్జిషీటు వేసేలా చూస్తాం. కేసుపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేపడతాం. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూస్తాం’’ అని మహారాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ జర్నలిస్టు సంఘాల ప్రతినిధి బృందంతో అన్నారు.
20 బృందాలతో దర్యాప్తు
అత్యాచారం సంఘటనకు సంబంధించి 20 బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్టు ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్‌సింగ్ తెలిపారు. వీటిలో 10 క్రైమ్ బ్రాంచి బృందాలు ఉన్నాయని, మిగతావి స్థానిక పోలీసులవని చెప్పారు. బాధితురాలు, ఆమె సహచరుడు అందించిన వివరాల మేరకు గురువారం రాత్రి ఊహచిత్రాలను గీయించామని, వాటి ఆధారంగా దర్యాప్తు ప్రారంభించామని అన్నారు. నిందితులందరినీ త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. బాధితురాలికి న్యాయం చేయడంతోపాటు నిందితులకు కఠిన శిక్ష పడేలా అన్ని ఆధారాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. ఈ కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జరిపించాలని కోరనున్నట్టు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి అన్ని రకాల ఆధారాలను కోర్టుకు సమర్పిస్తామన్నారు. నిందితులపై 341, 376బి, 341 తదితర సెక్షన్లతో కేసు నమోదు చేసినట్టు చెప్పారు. 376బి సెక్షన్ ద్వారా కనీసం 20 ఏళ్లు లేదా జీవిత ఖైదు శిక్ష పడేందుకు అవకాశాలున్నాయన్నారు.