‘షేల్’తో ఒపెక్ ఉక్కిరిబిక్కిరి
యుద్ధాల ద్వారా, అరబ్బు దేశాలను బెదిరించడం ద్వారా ఆయిల్ రేట్లు తనకు అనుకూలంగా సర్దుబాటయ్యేట్టు అమెరికా జాగ్రత్తపడింది! ఈ దశలో రానున్న పరిణామాలను ఊహిస్తున్న అమెరికా పాలకులు అరబ్ ఆయిల్‌పై ఆధారపడే స్థితి నుంచి బయటపడటం కోసం ఇంతవరకూ వెలికితీయకుండా ఉన్న ‘షేల్ ఆయిల్’ వనరులను వెలికితీసుకోడానికి శక్తియుక్తుల్ని కేంద్రీకరించారు. అప్పుడే ‘షేల్ ఆయిల్’ ఉత్పత్తులూ, స్థానికంగా మార్కెటింగూ ప్రారంభమయ్యాయి కూడా. దీనితో అమెరికా తన చమురు అవసరాలకు ఇంతవరకూ ఆధారపడిన అరబ్‌లో ఆయిల్ ఉత్పత్తులు మేట పడిపోతున్నాయి. ప్రధాన ఆయిల్ దిగుమతి దారయిన అమెరికా నుంచి ఆర్డర్లు తగ్గిపోతున్నాయి.
‘అమెరికాలోని పెట్రోలియం నిల్వలు (సహజ వాయు వుసహా) సౌదీ అరేబియా, తదితర గల్ఫ్ దేశాల నిల్వల కన్నా శరవేగాన కరిగిపోనున్నాయి. అందువల్లనే గల్ఫ్ చమురు వనరులను సాధ్యమైనంత గరిష్టస్థాయిలో దేశా నికి తరలించుకుపోవటం అమెరికాకు జీవన్మరణ సమ స్యగా మారింది’.
- హర్పాల్ బ్రార్ - ఎల్లారూల్: ‘‘ఇంపీరియలిజం ఇన్ ది మిడిల్ ఈస్ట్’’ గ్రంథం (2002), లండన్ ప్రచురణ.
దేశీయమైన పెట్రోలియం నిల్వలను అమెరికా ఇంత కాలంగా వినియోగించుకోకుండా దాచుకుని, అదే చము రు కోసం గల్ఫ్ దేశాలను యుద్ధాలకు గురిచేస్తూ, ప్రపం చంలోనే పెద్ద చమురు దొంగగా మిగిలింది. పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (‘ఒపెక్’) నరాలను పిండటం ద్వారా, అరబ్ దేశాల సంపదపైన, అయిల్ వనరులపైన, ఉత్పత్తి, ఎగుమతుల ధరవరల నిర్ణయంపైన ఆ సంస్థ అధికారాలను తుంచివేయడానికి ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్యవాదులు మొదటి నుంచి కుట్రలు పన్నుతూనే వచ్చారు. 1991-1992లో గల్ఫ్ దేశాలపైన ముఖ్యంగా ఇరాక్‌పైన యుద్ధం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ (సీనియర్) ఇందుకు పేర్కొన్న కారణం- ‘ప్రపంచంలోనే అత్యధిక ప్రమాణంలో కేంద్రీకరించి ఉన్న పశ్చిమాసియా ఆయిల్ వనరులు ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్ చేతుల్లోకి జారిపోతే, అమెరికా ప్రజల ఉపాధి, యావత్తు జీవనసరళీ, అమెరికాతో పాటు మిత్రదేశాల స్వేచ్ఛా - ప్రమాదంలో పడతాయి.’ అని.
అమెరికా ఎత్తుగడ
ఈ పూర్వ రంగంలోనే ఒపెక్ క్రమంగా తన చమురు ఎగు మతుల విధానాన్ని ‘ఆచి తూచి’ నిర్ణయించుకోసాగింది. పశ్చిమాసియా, ముఖ్యంగా అరబ్ దేశాల పెట్రోలియం వనరులపై కన్ను వేసిన అమెరికా ప్రవర్తనను ఒపెక్ కనిపెడుతూనే ఉంది. చౌక రేట్లకు ఆయిల్‌ను ఎలా తరలిం చుకోపోవాలా అన్నదే అమెరికా పన్నుగడ. అయితే పెక్కు ఆసియా ఆఫ్రికా దేశాలను శత్రువులుగా తాను మార్చుకుం టున్న క్రమంలో ‘ఒపెక్’ పెట్రోలియం ఎగుమతులకు ధరలను తన స్వప్రయోజనాల కోసం పెంచుకుంటూ వచ్చింది. అయినా సరే, తన ఆయిల్ వనరులు మాత్రం ఖర్చు కాకుండా, తన ప్రకటిత అప్రకటిత యుద్ధాల కోసం అమెరికా పాలకులు ‘ఒపెక్’ శాసించే ధర వరలకు తలొగ్గక తప్పలేదు. అయితే, యుద్ధాల ద్వారా, అరబ్బు దేశాలను బెదిరించడం ద్వారా ఆయిల్ రేట్లు తనకు అనుకూలంగా సర్దుబాటయ్యేట్టు అమెరికా జాగ్రత్తపడింది! ఈ దశలో రానున్న పరిణామాలను ఊహిస్తున్న అమెరికా పాలకులు అరబ్ ఆయిల్‌పై ఆధారపడే స్థితి నుంచి బయటపడటం కోసం ఇంతవరకూ వెలికితీయకుండా ఉన్న ‘షేల్ ఆయిల్’ (రాక్ ఆయిల్ = శిలా తైలం) వనరులను వెలికితీసుకోడా నికి 2008-2010 నుంచీ శక్తియుక్తుల్ని కేంద్రీకరించారు. అప్పుడే ‘షేల్ ఆయిల్’ ఉత్పత్తులూ, స్థానికంగా మార్కె టింగూ ప్రారంభమయ్యాయి కూడా. దీనితో అమెరికా తన చమురు అవసరాలకు ఇంతవరకూ ఆధారపడిన అర బ్లో ఆయిల్ ఉత్పత్తులు మేట పడిపోతున్నాయి. ప్రధాన ఆయిల్ దిగుమతి దారయిన అమెరికా నుంచి ఆర్డర్లు తగ్గిపోతున్నాయి. ఈ ధరలు అంతర్జాతీయంగా కూడా కొంత మేర తగ్గాయి.
చమురు ధర తగ్గింపు తాత్కాలికమే
ఇక్కడొక విచిత్రం ఉంది - ఎప్పటికప్పుడు ధరలు పెరుగు తున్నప్పటికీ నిన్న పెరిగిన ధరనే నేడు కంట్రోల్ ధరగా చూపడం, తగ్గినట్లు ‘బులబాటం’గా దేశాల పాలకులు వర్ణించి చూపడం ఒక రివాజు. ఇటీవల మన దేశంలో కూడా డీజిల్ ధర లీటర్‌కు మూడు రూపాయలు తగ్గినట్టు భావించుకోవటం ఇందులో భాగమే! పెట్రోల్ ధరపైన అంతకు ముందున్న రెగ్యులేషన్‌ను (నియంత్రణను) 2010లో మొదటిసారిగా యూపీఏ ఎత్తివేసింది. అక్కడి నుంచి ప్రతి 15 రోజులకొకసారి సమీక్షించుకుంటూ పెట్రో లియం సరకుల ధర వరలను సవరించుకుంటూ, హెచ్చి స్తూ, తగ్గిస్తూ వచ్చారు. ఒక స్థిరత్వం లేదు. పెట్రోలు, డీజి లూ రాజకీయంగా ఒడిదుడుకులను శాసించగల ఇంధన పదార్థాలుగా రూపొందాయి! ఈ ఏడాది ఏప్రిల్‌లో అంత ర్జాతీయంగా బ్యారెల్ ఒక్కంటికి తీవ్రస్థాయికి చేరుకున్న పెట్రోల్ రేటు 105 డాలర్లు కాగా, ఇప్పుడది 86 డాలర్లు దిగింది. కాని అది మళ్లీ పెరగదన్న గ్యారంటీ లేదు. ఒక వైపున డీజిల్ అంతకు ముందు పెరిగిన లీటర్ రూ. 66ల్లో మూడు, మూడున్నర తగ్గినందుకు హర్షం వెలిబుచ్చు తూనే ఈ సత్యాన్ని ఆయిల్ కంపెనీలు, పారిశ్రామిక వేత్తలు కూడా ప్రకటించక తప్పలేదు! డీజిల్‌పైన కంట్రోల్ ఎత్తివేసి ప్రపంచ బ్యాంక్ సిఫారసుల మేరకు సంత దోపి డీకి (మార్కెట్లో ఎవరి సత్తాను బట్టి ఆయా కంపెనీలు పెంచుకోడానికి వీలుగా) డీజిల్ ధరను వదిలిపెట్టారు! ప్రపంచంలో చమురు అవసరాలు రోజుకి 9 కోట్ల బ్యారె ల్సు కాగా, ప్రపంచంలోని 196 దేశాల్లో 20 దేశాల వద్ద మాత్రమే క్రూడాయిల్ అదనంగా ఉందని అంచనా. ఈ పరిస్థితుల్లో ఉత్తర అమెరికాలో ‘షేల్ ఆయిల్’ విప్లవం దూసుకొచ్చింది!
నిల్వలు బయటకు తీస్తున్న అమెరికా
ఈ ‘సద్దు’ మొదలై పట్టుమని నాలుగేళ్లు కూడా కాలేదు. 2008 నుంచీ క్రమంగా అమెరికా ‘ఒపెక్’ దేశాల నుంచి 30 శాతం దాకా చమురు దిగుమతులని తగ్గించుకుంటూ వచ్చి, 2014 నాటికి 50 లక్షల బ్యారెల్స్‌కు కుదించివేసింది. ఇక్కడ బీజేపీ సర్కారు విదేశీ గుత్త పెట్టుబడి సంస్థలకు మరిన్ని రాయితీలు కల్పిస్తూ ఆయిల్ వ్యాపారంలో మళ్లీ రిలయెన్స్, ఎస్సార్, బర్మాషెల్ వగైరా ప్రైవేటు కంపెనీలు ఇంత కు ముందు ఎత్తివేసిన ఆయిల్ విక్రయ కేంద్రాలను (బంకులను) చకచకా తెరవడానికి వీలు కల్పించింది. ఈ పోటీలో ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం కంపె నీల నిర్వహణకు ప్రైవేటు గుత్త కంపెనీలు ఎసరు పెట్టే అవకాశం చిక్కింది. ఈ పరిణామాలను కనిపెడుతున్న ఆయిల్ రంగంలోని ఆర్థికనిపుణులు ‘డీజిల్ ధర ఇప్పటికి తగ్గినట్టు కనిపించవచ్చు. కానీ కొలది మాసాలలోనే మళ్లీ ముడి పెట్రోలియం ధరలు పెరగనున్నాయి. ఇక చౌకగా బ్యారెల్ ఒక్కంటికి ఆయిల్ 50 డాలర్లకు దొరికే అవకాశం కాస్తా అంతరించింది. రానున్న ఏడాదిలోనే ఈ ధర బ్యారె ల్కు 100 డాలర్లకు లేదా అంతకు మించి కూడా పెరిగిపో నున్నదని’ హెచ్చరిస్తున్నారు. ‘షేల్ ఆయిల్’తో పాటు షేల్ గ్యాస్ సహజవాయువుగా శిలల (రాక్) పొరలలో నిక్షి ప్తమై ఉంటుంది. మొదట్లో ఈ శిలలను తవ్వడం ఆర్థికం గా లాభసాటి కాదని భావించారు. ఎప్పుడైతే సహజ వాయువు బయటపడిందో అమెరికాలో ఈ పరిశ్రమకు వెలుగు, విలువ వచ్చాయి. 2009లో ఈ గ్యాస్ 82 శాతం స్థానికంగానే ఉత్పత్తి కావడం ప్రారంభమైంది. ఈ గ్యాస్ దాదాపు 110 సంవత్సరాల దాకా లభ్యం అవుతూనే ఉం టుందని నిపుణుల అంచనా.
తెలుసుకోవలసిన నిజాలు
ఏది ఎలా ఉన్నా ఆయిల్ గురించిన కొన్ని మౌలికమైన వాస్తవాలు మనకు తెలిసి ఉండాలని నిపుణులు అంటు న్నారు. ఎవరి వద్ద ఎన్ని ఆయిల్ వనరులు ఉన్నాయి? ధరవరలలో వచ్చే మార్పుల వల్ల జరిగేదేమిటి? ఇందులో రాజకీయాలు, ఆర్థికాంశాలు ఎలా చొరబడుతూ ఉంటా యి? ప్రపంచ ఆయిల్ వనరులలో 65 శాతం పశ్చిమాసి యాలోనే ఉన్నాయి. అందుకనే అమెరికాతో పశ్చిమాసి యా దేశాలు ముఖ్యంగా అరబ్ దేశాలు జరిపిన చమురు వర్తక వాణిజ్యాల ఫలితంగా ఆయా దేశాలు అపారమైన పెట్రో డాలర్‌తో (పెట్రోలియం ఎగుమతితో వచ్చిన సొ మ్ము) మునిగి తేలుతూ వచ్చాయి. ఆయిల్ రాయల్టీలు అనంతంగా అమెరికా యూరప్‌లలో మేట వేసుకున్నాయి. ఈ పెట్రో డాలర్లే సామ్రాజ్యవాద ద్రవ్య సంస్థలు, బ్యాంకు లకు రక్షణగా నిలుస్తూ వచ్చాయి. గల్ఫ్ దేశాలకు పెట్రోలి యం ఎగుమతుల ద్వారా సామ్రాజ్యవాద దేశాల నుంచి సంపాదించిన పెట్రో డాలర్లను లండన్, ఫ్రాంక్ఫర్ట్, పారి స్ ఆర్క్, న్యూయార్క్‌లలోని ఇంపీరియలిస్ట్ బ్యాంకులలో నూ ముఖ్యంగా సిటీ కార్ప్, బ్యాంకర్స్ ట్రస్ట్, కెమికల్ బ్యాంక్, మోర్గాన్ గ్యారంటీ, ఛేజ్ మన్హాతన్ బ్యాంకుల లోనూ మేటవేసుకున్నాయి. వీటిని కాజేసే కుట్రలో భాగం గానే ఒపెక్ సంస్థను దివాలా తీయించడానికి అమెరికా సిద్ధమవుతోంది. ‘షేల్ గ్యాస్ ఆయిల్’ ఒపెక్ ఉత్పత్తుల ఉధృతికి కళ్లెం వేస్తోంది. ఈ క్రమంలో ఇండియా లాంటి వర్ధమాన దేశాలతో ఒపెక్ లావాదేవీలు సరసమైన రీతిలో సాగడానికి అవకాశాలు లేకపోలేదు.
విశ్లేషణ: ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు