‘శంభో శంకర’ మూవీ రివ్యూ
టైటిల్ : శంభో శంకర
జానర్ : కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్
తారాగణం : షకలక శంకర్, కారుణ్య చౌదరి, నాగినీడు, అజయ్ ఘోష్ తదితరులు
సంగీతం : సాయి కార్తీక్
దర్శకత్వం : ఎన్. శ్రీధర్
నిర్మాత : రమణా రెడ్డి, సురేశ్ కొండేటి
స్టార్ హీరోలు సైతం కామెడీ చేస్తూ సినిమాల్లో అభిమానులకు కిక్ ఇస్తున్నారు. ప్రస్తుతం సినిమా సక్సెస్‌లో ప్రధాన పాత్ర పోషించేది ఎంటర్టైన్మెంటే. సో.. ఈ నేపథ్యంలో కమెడియన్స్ హీరోలుగా మారి సినిమాలు చేస్తున్నారు. అయితే వీరిలో సక్సెస్ సాధించిన వారు మాత్రం చాలా అరుదు. గతంలో హీరోలుగా మారిన చాలా మంది కమెడియన్స్ తరువాత తిరిగి కామెడీ రోల్స్‌లోకి మారిపోయారు. ప్రస్తుతం జబర్దస్త్ షోతో ఫేమస్ అయిన షకలక శంకర్ హీరోగా మారి ‘శంభో శంకర’తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి షకలక శంకర్ హీరోగా సక్సెస్ సాధించాడా..?
కథ
కడప జిల్లా అంకాలమ్మ పల్లె గ్రామంలో జరిగే కథ ఇది. ఆ ఊరికి రాబందు లాంటి ప్రెసిడెంట్ అజయ్ ఘోష్. ఆ ప్రెసిడెంట్‌కు తోడు గా ఓ అవినీతి పోలీసాఫీసర్. వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ ఊరి ప్రజలకు అండగా ఉంటాడు మన హీరో శంకర్ (షకలక శంకర్). ఇక ఈ కథనంలో ఊర్లో శంకర్‌కి ఒక ప్రేయసి పార్వతి (కారుణ్య చౌదరి). ప్రెసిడెంట్ కొడుకు మూలంగా చెల్లెల్ని పోగొట్టుకున్న శంకర్ ఆ ప్రెసిడెంట్ కొడుకును చంపేస్తాడు. దీంతో ఇద్దరి మధ్య వైరం మొదలవుతుంది.(సాక్షి రివ్యూస్) ప్రెసిడెంట్ పెత్తనాన్ని ప్రశ్నిస్తూ శంకర్ ఊరి ప్రజలకు అండగా నిలబడతాడు. అయితే కథలో ప్రెసిడెంట్ కంటే పెద్దదొంగ ఒకడు ఉంటాడు. అతడికి మన హీరో శంకర్‌కి మధ్య సంబంధం ఏమిటి? అసలైన ఆ గజదొంగ ఎవరు? అనేది తెలుసుకోవాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.
నటీనటులు
తన కామెడీతో అందరిని నవ్వించే షకలక శంకర్‌కు హీరోగా మారడం కోసం పడ్డకష్టం తెరపై కనిపిస్తుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘తిండిలేక కొంత ఎక్సర్సైజ్ చేసి మరికొంత సన్నబడ్డా’నని చెప్పుకొచ్చారు శంకర్. హీరో స్థాయిలో కాకపోయినా మంచి లుక్‌లో కనిపించాడు. (సాక్షి రివ్యూస్) ఈ సినిమా కోసం డ్యాన్సులు, ఫైట్స్ విషయంలో బాగానే కష్టపడ్డాడు. డైలాగ్ డెలివరీ విషయంలో కూడా ఓకే అనిపించాడు. ఇక హీరోయిన్గా పార్వతి పాత్రలో కారుణ్య చౌదరిమ దక్కింది చిన్న పాత్రే. తనకున్న ఏడెనిమిది సన్నివేశాల్లో ప్రేక్షకులకు మెప్పించే ప్రయత్నం చేశారు. ప్రెసిడెంట్‌గా అజయ్‌ఘోష్ ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రల్లో రవి, నాగినీడు, హీరో స్నేహితులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
విశ్లేషణ
ఒక కమెడీయన్‌ను హీరోగా పెట్టి సినిమా తీయాలనుకున్నప్పుడు.. దర్శకులు కామెడీ ఎంటర్‌టైనర్‌నో లేదా.. కథా బలం ఉండి ఆకట్టుకునే కథనంతో ఉన్న చిత్రాలనో ఎంచుకుంటారు. కానీ దర్శకుడు శ్రీధర్ మాత్రం శంకర్‌తో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ను ట్రై చేశాడు. సినిమా ప్రమోషన్స్‌లో వీరావేశంగా.. కథపై ఉన్న నమ్మకంతో త్రివిక్రమ్, దిల్‌రాజు, రవితేజ, అల్లు శిరీష్‌ను కలిసాను... వాళ్లలో కొందరు తీయడానికి రెడీగా ఉన్నా.. టైమ్ పడుతుందని అన్నారంటూ శంకర్ చెప్పారు.(సాక్షి రివ్యూస్) కానీ సినిమా చూస్తే అంత బలమైన కథగా కనిపించదు. చాలా సన్నివేశాల్లో గతంలో వచ్చిన సినిమాల్లోని ఛాయలు కనిపిస్తాయి. కొన్ని మాస్ డైలాగ్‌లు పర్వాలేదనిపించినా.. శంకర్ బాడీలాంగ్వెజ్‌కు సెట్ కాలేదు. పోలీస్ రిక్రూట్మెంట్ సీన్స్ మరీ సిల్లీగా అనిపిస్తాయి. పాటలు వినడానికి పరవాలేదనిపించినా విజువల్‌గా నిరాశపరిచాయి. పవన్ ఇమేజ్ను వాడుకొని జబర్థస్త్‌లో క్రేజ్ తెచ్చుకున్న శంకర్ వెండితెర మీద కూడా అదే ప్రయత్నం చేశాడు. అయితే ఈ సారి ఆ ప్రయత్నం పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ డిపార్ట్మెంట్ పరవాలేదనిపిస్తాయి.
ప్లస్ పాయింట్స్ :
శంకర్ ప్రయత్నం
అక్కడక్కడా కొన్ని డైలాగ్స్
సంగీతం
మైనస్ పాయింట్స్ :
కథా కథనం
సాంకేతిక వర్గం
ముగింపు : ‘పని లేక ఖాళీగా ఉన్నందుకు హీరోగా చేశా’నని చెప్పిన శంకర్ అంతగా మెప్పించలేకపోయాడు.
బండ కళ్యాణ్, ఇంటర్నెట్ డెస్క్.