మంత్రిగారు సిగ్గుతో తల దించుకున్నారట..!
(సాక్షి వెబ్ ప్రత్యేకం)
ఆరోగ్యశాఖ మంత్రి సిగ్గుతో తలదించుకున్నారట. ప్రభుత్వ ఆస్పత్రిలో పసి పిల్లలతో పాటు ఎలుకలు కూడా ఉన్నందుకు.. అందులో ఒక ఎలుక సరదాగా ఓ పసికందును కొరికినందుకు.. ఆ పసికందు చనిపోయినందుకు.. మంత్రిగారు సిగ్గుతో తలదించుకున్నారట.
ఇది నిన్న ఉదయం మాట. ఆస్పత్రిలో మంత్రిగారి, అధికారుల హడావుడి.. బిలబిలలాడుతూ తిరిగేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించేశారు. విచారణ కమిటీ కూడా వేశారు. నర్సుల సస్పెన్షన్ .. సూపరింటెండెంట్, మరో వైద్యుడి బదిలీ జరిగిపోయింది. అక్కడితో ప్రభుత్వం బాధ్యత తీరిపోయింది. పసికందు ప్రాణాల వెల సస్పెన్షన్, బదిలీ .. అంతే ఇంకేమీ లేదు.
విచారణ కమిటీ ఏం చెప్పింది.. ఎలుకలు ఏవో సరదాగా కొరికాయి.. కానీ పసికందు చావుకు అవి కారణం కాదు. పుట్టుకతోనే లోపాలున్న ఆ శిశువుకు వారం రోజులుగా వైద్యం అందుతోందట. వెంటిలేటర్‌పైన పసికందును ఉంచామని కూడా చెప్పారు. అసలు సమస్య ఇక్కడే.. వెంటిలేటర్ పై చికిత్స.. అంటే ఐసీయూ ట్రీట్ మెంట్.. ఐసీయూలో ఎలుకలు.. ఇదేదో జనరల్ వార్డులో జరిగిన ఘటన కాదు.. ఆశతో ఆస్పత్రికి వచ్చిన పేద ప్రజలకు వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.
సింగపూర్ చేస్తాం.. జపాన్‌లాగా మార్చేస్తాం.. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గం.. ఈ మధ్య ప్రభుత్వ పెద్దలు పదే పదే వల్లె వేస్తున్న స్లోగన్స్ కదా! ఇదే ఘటన సింగపూర్లోనో, జపాన్లోనో జరిగితే ఏమయ్యేది? వార్డు బాయ్ నుంచి ప్రభుత్వ నేతల వరకు బోనులో నిలబడాల్సి వచ్చేది. కటకటాలు లెక్కించక తప్పేది కాదు.. భారీ నష్ట పరిహారం సరేసరి...
మనం మసిపూసి మారేడు కాయ చేయడంలో గోల్డ్ మెడలిస్టులం కదా! పసికందు మరణానికి మాది బాధ్యత కాదు.. అలా పుట్టడమే వాడి తప్పు అనేంతటి నివేదిక తయారు. ఒక్క క్షణం నిజమే అనుకుందాం.. మరి ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకల సంగతేమిటి మంత్రిగారూ? ఇది కూడా పసికందు చేసుకున్న పాపమేనా.. తనతోపాటు ఎలుకల్ని కూడా తెచ్చుకున్నాడా! సరదాగా ఆడుకోవడానికి. ఆ సరదాగా తీర్చుకుంటుండగా సరదాగా ఎలుక ఒకసారి కాదు.. రెండుసార్లు కొరికింది! మరి అదే నిజమైతే సస్పెన్షన్లు బదిలీలు ఎందుకో..
పసికందు ప్రాణం పోయిన తర్వాత.. ఎలుకలు పట్టేవాళ్లని పిలిపించారట. వాళ్లు కొద్దిగా కష్టపడి ఓ 50 ఎలుకల్ని పట్టుకున్నారట. ఇంకొద్దిగా శ్రమిస్తే బొరియల్లో దాక్కున్న ఎలుకలు కూడా దొరుకుతాయి కూడా. సరే.. గుంటూరు ఆస్పత్రిలో ఎలుకల్ని పట్టుకొని పసికందులు సరదాగా ఆడుకోకుండా కట్టడి చేశారు ప్రభుత్వ పెద్దలు.. మరి మిగతా ఆస్పత్రుల మాటేమిటో.. ఎలుకలకి ప్రభుత్వ ఆస్ప్రతిలో చికిత్స పొందుతున్న పసికూనలంటే పక్షపాతం.. అక్కడే సరదాగా ఆడుకుంటాయి. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల జోలికి వెళ్లకుండా.. ఎలుకల పక్షపాతం నశించాలి అని గొడవ చేయాలేమో.
ఎలుకలే కాదు.. పందికొక్కులు, పందులు, కుక్కలలాంటివి కూడా మన ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరదాగా ఆడుకుంటాయి. అప్పుడప్పుడు నోట కరుచుకుని బయటకు తీసుకుపోయి సరదాగా ఆడుకుంటాయి. పిల్లులు కూడా తమ హాజరు వేయించుకుంటాయి. దోమలు సహజీవనమే చేస్తాయి. విరిగిపోయిన మంచాలు, కనిపించని పరుపులు, ఊగిపోయే సీలింగ్ ఫ్యాన్లు, పెచ్చులూడే పై కప్పులు, దొరకని మందులు, అందుబాటులో లేని వైద్యసిబ్బంది.. ప్రభుత్వ ఆస్పత్రుల గురించి ఎప్పుడు రాసినా అందుబాటులో ఉండే పదాలు.. అక్షర సత్యాలు. ప్రాథమిక వైద్యం అందుబాటులో ఉండదు.. మెరుగైన వైద్యం.. అబ్బే కనుచూపు మేరలో కనపడదు.. తెల్లకోట్లు, తెల్లగౌన్లు మెరుపులా మెరిసి మాయమవుతాయి. సెలైన్ స్టాండ్ బదులు నిలువునా నిలబడ్డ మనిషి దర్శనమిస్తాడు.
ఆపరేషన్ జరగాలంటే కనీసం 3 నెలలు ఆగాలి. ఈలోపు ఆ మనిషి బతికుంటే పీక్కు తినడానికి ఎలుకలు, పందికొక్కులు రెడీ. ఒక్కో బెడ్‌ను పంచుకునే ఇద్దరు ముగ్గురు బాలింతలు.. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటే ఆస్పత్రి గచ్చపై పొర్లుదండాలు పెడుతూ పడుకోవాల్సిందే.
అయినా వైద్య రంగానికి మనం వేలకోట్లు కేటాయిస్తూనే ఉంటాం. ఆ డబ్బు ఎక్కడికి వెళుతుందో తెలియదు. హాస్పిటల్లో మాత్రం ఎలుకలు తిరుగుతూనే ఉంటాయి. పసికందుల్ని కొరుక్కు తింటూనే ఉంటాయి. పల్లె నిద్ర, హాస్టల్ నిద్రల్లాగ ఈమధ్య హాస్పిటల్ నిద్ర ... ఇలా నిద్రపోయిన ప్రముఖుల దరిదాపుల్లోకి ఎలుకలు మాత్రం రావు. బహుశా ముందురోజే ఎలుకల్ని బంధించేసి ఉంటారు.
పదుల సంఖ్యలో ఎలుకల్ని బంధించి పట్టుకెళ్తున్న దృశ్యం నిజంగానే సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. రేప్పొద్దున్న ఎలుకలు పట్టే కాంట్రాక్టు ప్రకటన వెలువడినా ఆశ్యర్యపడాల్సిన పనిలేదు. ఆ కాంట్రాక్టు కూడా అస్మదీయులకే వెళ్తుందనేది వేరే విషయం. ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులకు కావాల్సింది ఎలుకలు పట్టేవారు. లేకపోతే మంత్రిగారు మరోసారి సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది.