Shamshabad Outer Ring Road
-
శివ లైఫ్ స్టయిల్ చూసి ఖాకీలే షాక్!
హైదరాబాద్ : శంషాబాద్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఎన్కౌంటర్లో మృతి చెందిన చైన్ స్నాచర్ శివ లైఫ్ స్టయిల్‌ను చూసి పోలీసులు షాక్ తిన్నారు. నార్సింగ్‌లో శివ అద్దెకుంటున్న త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్‌లో అతని లగ్జరీ జీవితాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అతడు ఉపయోగిస్తున్న ఫర్నిచర్, ప్లాస్మా టీవీ నుంచి అక్వేరియం వరకూ అన్నీ అత్యంత ఖరీదైనవే. అంతే కాకుండా రెండు లగ్జరీ కార్లుతో పాటు ఓ స్పోర్ట్స్ బైక్, స్కూటీని పోలీసులు సీజ్ చేశారు. దొంగతనాలకు పాల్పడే వ్యక్తి విశాలమైన ఇల్లు, కాస్ట్లీ ఇంటీరియర్స్ చూసిన పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఇక చైన్ స్నాచింగ్‌లకు పాల్పడే శివ ఎవరికీ అనుమానం రాకుండా ప్రవర్తించేవాడు. మూడు నెలలకు ఓసారి ఇల్లు మారేవాడు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసేకునే అతడు... వారిని అడ్రస్ అడుగుతున్నట్లు నటిస్తూ వారి మెడల్లో నుంచి బంగారు ఆభరణాలు లాక్కెళ్లేవాడు. అప్పటికే మరొకరు కారులో సిద్ధంగా ఉండగా, ఆ వాహనంలో శివ ఎస్కేప్ అయ్యేవాడు. అనంతరం బంగారు ఆభరణాలను అమ్మి భార్యా పిల్లలతో ఇతర రాష్ట్రాలకు విహార యాత్రలకు వెళ్లి విలాసవంతమైన జీవితం గడిపేవాడు. అలాగే తన భార్య ఎకౌంట్లో డబ్బులు వేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు. గతంలో ఓసారి పోలీసులకు చిక్కినట్లే చిక్కి శివ... పరారయ్యాడు. రెండు రోజుల క్రితం కూడా కానిస్టేబుల్‌పై అతడు దాడి చేసినట్లు సమాచారం. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు శివ నివాసాన్ని గుర్తించారు. శివ భార్యతో పాటు మరో ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
మా వాళ్లపై దాడి ... అందుకే కాల్పులు
హైదరాబాద్: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై పోలీసు ఎన్కౌంటర్లో మృతి చెందిన శివపై హైదరాబాద్ పరిధిలో 400లకు పైగా కేసులు ఉన్నాయని సైబరాబాద్ పోలీసుల కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. శనివారం ఉదయం ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని ఆయన సందర్శించారు. అనంతరం సీవీ ఆనంద్ మాట్లాడుతూ... నిందితుడు శివ నార్సింగ్‌లో తలదాచుకున్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. దాంతో సెల్‌టవర్ ఆధారంగా అతడున్న ప్రాంతం గుర్తించి.... శంషాబాద్ సమీపంలో పోలీసులు నాకాబందీ నిర్వహించారని చెప్పారు. శివను తనిఖీ చేస్తున్న క్రమంలో ఎస్.ఐ. వెంకటేశ్వర్లుపై కత్తితో దాడి చేశారని... ఆత్మరక్షణ కోసమే వెంటనే స్పందించిన సీఐ నరసింహారెడ్డి కాల్పులు జరిపాడని సీవీ ఆనంద్ వివరించారు. ఎన్కౌంటర్ అనంతరం మృతుడు శివ అనుచరుడు జగదీశ్, అతడి భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. రెండు రోజుల క్రితం ఎల్బీనగర్లో శివ పోలీసులపై దాడి చేసి తప్పించుకున్నాడని ఆనంద్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
పోలీసు కాల్పుల్లో క్రిమినల్ శివ మృతి
-
పోలీసు కాల్పుల్లో క్రిమినల్ శివ మృతి
హైదరాబాద్: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక దుండగుడు మృతిచెందాడు. మృతుడు నెల్లూరుకు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శివకుమార్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. రింగ్ రోడ్డుపై వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పోలీసులపై శివ కత్తితో దాడి చేసి, అనంతరం కాల్పులు జరిపాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు దుండగుడిపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో క్రిమినల్ శివ మృతిచెందగా, పోలీస్ ఇన్స్పెక్టర్ నర్సింహారెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. నర్సింహారెడ్డిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు శివకుమార్ దాదాపు 300 చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడని, మరికొన్ని కేసులు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు. శివ చేసిన దాడిలో పోలీసు అధికారులు గాయపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎస్సై నర్సింహారెడ్డి మాదాపూర్‌లోని హిమగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. నెల్లూరు జిల్లా ఓజిలి మండలం ఆర్మేనిపాడుకు చెందిన శివ.. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 300కు పైగా చైన్ స్నాచింగ్, దొంగతనాల కేసులలో నిందితుడు. ఇతడిని పట్టుకోడానికి పోలీసులు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే అతడు అనుకోకుండా దొరకడం, పోలీసు కాల్పుల్లో మృతిచెందడం విశేషం. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)