
శివ లైఫ్ స్టయిల్ చూసి ఖాకీలే షాక్!
హైదరాబాద్ : శంషాబాద్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఎన్కౌంటర్లో మృతి చెందిన చైన్ స్నాచర్ శివ లైఫ్ స్టయిల్‌ను చూసి పోలీసులు షాక్ తిన్నారు. నార్సింగ్‌లో శివ అద్దెకుంటున్న త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్లో అతని లగ్జరీ జీవితాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అతడు ఉపయోగిస్తున్న ఫర్నిచర్, ప్లాస్మా టీవీ నుంచి అక్వేరియం వరకూ అన్నీ అత్యంత ఖరీదైనవే. అంతే కాకుండా రెండు లగ్జరీ కార్లుతో పాటు ఓ స్పోర్ట్స్ బైక్, స్కూటీని పోలీసులు సీజ్ చేశారు. దొంగతనాలకు పాల్పడే వ్యక్తి విశాలమైన ఇల్లు, కాస్ట్‌లీ ఇంటీరియర్స్ చూసిన పోలీసులు సైతం అవాక్కయ్యారు.
ఇక చైన్ స్నాచింగ్లకు పాల్పడే శివ ఎవరికీ అనుమానం రాకుండా ప్రవర్తించేవాడు. మూడు నెలలకు ఓసారి ఇల్లు మారేవాడు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసేకునే అతడు... వారిని అడ్రస్ అడుగుతున్నట్లు నటిస్తూ వారి మెడల్లో నుంచి బంగారు ఆభరణాలు లాక్కెళ్లేవాడు. అప్పటికే మరొకరు కారులో సిద్ధంగా ఉండగా, ఆ వాహనంలో శివ ఎస్కేప్ అయ్యేవాడు. అనంతరం బంగారు ఆభరణాలను అమ్మి భార్యా పిల్లలతో ఇతర రాష్ట్రాలకు విహార యాత్రలకు వెళ్లి విలాసవంతమైన జీవితం గడిపేవాడు.
అలాగే తన భార్య ఎకౌంట్లో డబ్బులు వేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు. గతంలో ఓసారి పోలీసులకు చిక్కినట్లే చిక్కి శివ... పరారయ్యాడు. రెండు రోజుల క్రితం కూడా కానిస్టేబుల్పై అతడు దాడి చేసినట్లు సమాచారం. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు శివ నివాసాన్ని గుర్తించారు. శివ భార్యతో పాటు మరో ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.