
పోలీసు కాల్పుల్లో క్రిమినల్ శివ మృతి
హైదరాబాద్: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక దుండగుడు మృతిచెందాడు. మృతుడు నెల్లూరుకు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శివకుమార్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. రింగ్ రోడ్డుపై వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పోలీసులపై శివ కత్తితో దాడి చేసి, అనంతరం కాల్పులు జరిపాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు దుండగుడిపై ఎదురు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో క్రిమినల్ శివ మృతిచెందగా, పోలీస్ ఇన్‌స్పెక్టర్ నర్సింహారెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. నర్సింహారెడ్డిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు శివకుమార్ దాదాపు 300 చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడని, మరికొన్ని కేసులు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు. శివ చేసిన దాడిలో పోలీసు అధికారులు గాయపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎస్సై నర్సింహారెడ్డి మాదాపూర్‌లోని హిమగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది.
నెల్లూరు జిల్లా ఓజిలి మండలం ఆర్మేనిపాడుకు చెందిన శివ.. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 300కు పైగా చైన్ స్నాచింగ్, దొంగతనాల కేసులలో నిందితుడు. ఇతడిని పట్టుకోడానికి పోలీసులు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే అతడు అనుకోకుండా దొరకడం, పోలీసు కాల్పుల్లో మృతిచెందడం విశేషం.