కాల్పుల కలకలం
శంషాబాద్: జిల్లాలో దుండగులు పోలీసులపై తిరగబడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా శంషాబాద్ ఔటర్ సర్వీసు రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి సీసీఎస్ పోలీసులు తనిఖీలు చేపడుతుండగా వారిపై మోస్ట్‌వాంటెడ్ చైన్‌స్నాచర్ కడవలూరి శివ(28) కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ వెంటనే సీసీఎస్ సీఐ సుదర్శన్‌రెడ్డి కాల్పులు జరపడంతో అక్కడికక్కడే శివ మృతి చెందాడు.
జంట కమిషనరేట్ల పరిధిలో ఇతడిపై పెద్దఎత్తున చైన్‌స్నాచింగ్ కేసులున్నాయి. కూకట్పల్లి పోలీస్‌స్టేష న్ పరిధిలోనే మొత్తం 30 కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. శంషాబాద్ ఆర్జీఐఏ, రూరల్ పోలీస్స్టేషన్ల పరిధిలో కూడా శివ గొలుసు దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
సంచలనంగా మారిన ఘటన
ఔటర్ సర్వీసు రహదారిపై జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కొన్నాళ్ల క్రితమే శామీర్‌పేటలోనూ ఇదే తరహ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుత కాల్పుల ఘటన శంషాబాద్ మండలంలో చర్చనీయాంశంగా మారింది. దొంగలు తెగబడుతున్న తీరుపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. హతుడు శివ స్థానికంగా కూడా పలు దొంగతనాలకు పాల్పడినట్లు తెలియడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉండే ఔటర్ సర్వీసు రహదారిపై ఎప్పుడు ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటుందోనని స్థానికులు వణికిపోతున్నారు.